సాఫీగా సాగుతున్న ప్రయాణంలో వేరే పార్టీ వాళ్లు వస్తే డిస్టర్బ్ చేస్తారు: కేసీఆర్

  • ప్రజల కోసం పని చేసేవారిని గెలిపించి ప్రోత్సహించాలని కేసీఆర్ విజ్ఞప్తి
  • వెనుకబడిన వారి కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శ
  • దళిత బంధు ఒకేసారి అందరికీ ఇవ్వలేకపోవచ్చు.. దశలవారీగా ముందుకు సాగుతామని వెల్లడి
ప్రజల కోసం పని చేసేవారిని గెలిపించి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాను చెప్పేమాటలను మేధావులు ఆలోచన చేయాలన్నారు. వెనుకబడిన వారి కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. కానీ దళితబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ అన్నారు. ఈ పథకాన్ని ఒకేసారి అందరికీ అమలు చేయలేకపోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంత లేకపోవచ్చు.. కానీ ఆ నినాదం వస్తే వారిలో ఆత్మవిశ్వాసం రావాలి.. దఫాల వారీగా అయినా సరేనని కంకణం కొట్టుకొని ఇంటికి రూ.10 లక్షలు ఇచ్చేలా దళితబంధు కార్యక్రమాన్ని తీసుకు వచ్చామన్నారు.

ఆడబిడ్డల గోస తీరాలని, దూప తీరాలని మిషన్‌ భగరీథ ద్వారా శుద్ధమైన మంచినీళ్లు తెచ్చామన్నారు. దీంతో కరెంట్ బాధను శాశ్వతంగా దూరం చేసుకున్నామన్నారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిస్తే భాస్కరరావు కోరిన కోర్కెలు నెరవేరుస్తానన్నారు. అక్కడి నిరుద్యోగులకు పవర్‌ప్లాంట్‌లో ఉద్యోగాలు వచ్చేలా చేయిస్తానని చెప్పారు. మంచిపనుల కోసం తపించే.. మంచి నాయకుడు ఎప్పుడు ఉన్నా వారిని గెలిపించే ప్రయత్నం జరగాలన్నారు. ఈ రోజు మన సమస్యలన్నింటినీ ఒక్కటొక్కటీగా తీర్చుకుంటున్నామన్నారు.

ఒక రాష్ట్రం, ఒక దేశం బాగుపడ్డదా? లేదా? అని తెలుసుకునేందుకు కొన్ని గీటురాళ్లు ఉంటాయని, అంతర్జాతీయ ప్రామాణికతలు ఉంటాయన్నారు. ఏ రాష్ట్రమైనా బాగుపడిందా? లేదా? అని చూసేందుకు గీటురాయి ఆ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? తలసరి విద్యుత్‌ వినియోగం ఎంత? అని చూస్తారన్నారు. రాష్ట్రం ఏర్పడిననాడు తలసరి ఆదాయం లక్షలోపు ఉండెనని, అప్పుడు 15వ స్థానంలో ఉన్నామన్నారు. కానీ ఇప్పుడు కేవలం పదేళ్ల చిన్న వయసున్న తెలంగాణ తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉందన్నారు. అలాగే తలసరి విద్యుత్‌ వినియోగంలో, మంచినీళ్ల సరఫరాలో నెంబర్‌ వన్‌గా ఉన్నామన్నారు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రయాణం సాఫీగా సాగుతోందని, కానీ వేరేవాళ్లు వస్తే డిస్టర్బ్ చేస్తారని, వాళ్ల వైఖరి, ఆలోచన సరళి మీకు తెలుసు కాబట్టి బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు.


More Telugu News