రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల

  • స్కిల్ కేసులో 53 రోజులుగా రిమాండ్ లో ఉన్న చంద్రబాబు
  • మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
  • జైలు వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ 
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 53 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇవాళ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల అనంతరం తిరిగి నవంబరు 28న సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ అవ్వాలని ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో, జైలులో లాంఛనాలన్నీ ముగించుకున్న చంద్రబాబు ప్రధాన ద్వారం నుంచి వెలుపలికి వచ్చారు. చంద్రబాబు కోసం జైలు బ్యారికేడ్లను కూడా తోసుకుని వేలాదిమంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు రావడంతో అక్కడంతా కోలాహలం నెలకొంది. చంద్రబాబును చూడగానే టీడీపీ శ్రేణుల్లో భావోద్వేగాలు మిన్నంటాయి. జై చంద్రబాబు నినాదాలతో జైలు పరిసరాలు మార్మోగిపోయాయి. సింహం వచ్చిందీ అంటూ కొందరు నినాదాలు చేయడం కనిపించింది.

చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం మద్దతుదారులకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. అచ్చెన్నాయుడు, తదితర ముఖ్యనేతలతో మాట్లాడారు. జైలు నుంచి వెలుపలికి వచ్చిన చంద్రబాబును చూడగానే టీడీపీ నేతల్లో ఆనందం పొంగిపొర్లింది. ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, విడుదల నేపథ్యంలో చంద్రబాబు కాన్వాయ్, ఎన్ ఎస్ జీ బృందం జైలుకు వద్దకు చేరుకుంది. చంద్రబాబు అమరావతి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.


More Telugu News