తెలంగాణ బాటలో తమిళనాడు.. గవర్నర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్

  • గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్
  • ప్రభుత్వం పంపిన బిల్లులు, ఫైల్స్ కు ఆమోదం చెప్పడం లేదంటూ ఆక్షేపణ
  • గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్న తమిళనాడు సర్కారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరే తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం పంపించిన బిల్లులకు ఆమోదం చెప్పకుండా, జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేస్తున్నాం. తమిళనాడు లెజిస్లేచర్ ఆమోదించి, పంపించిన బిల్లులను తమిళనాడు గవర్నర్ రాజ్యాంగపరమైన ఆమోదం తెలిపే విషయంలో నిష్క్రియ, విస్మరణ, జాప్యం చేయడం ద్వారా విఫలమయ్యారు. శాసనసభ, ప్రభుత్వం పంపించిన ఫైల్స్ ను పరిశీలించకపోవడం రాజ్యాంగ విరుద్ధం. చట్ట విరుద్ధం, ఏకపక్షం, అధికార దుర్వినియోగం చేయడమే అవుతుంది’’ అని తన పిటిషన్ లో తమిళనాడు సర్కారు తీవ్ర ఆరోపణలు చేసింది. 

12 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా, తన వద్దే ఉంచుకున్న విషయాన్ని ప్రస్తావించింది. గవర్నర్ తీరుతో మొత్తం యంత్రాంగం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడినట్టు పేర్కొంది. నిర్ధేశిత సమయంలోపు అన్ని బిల్లులను ఆమోదించేలా గవర్నర్ ను ఆదేశించాలని కోరింది. గవర్నర్ వీలైనంత త్వరగా బిల్లులను ఆమోదించాలని, ఆయన తీరు రాజ్యంగబద్ధంగా లేదని ఆక్షేపణ వ్యక్తం చేసింది. గత ఆదివారం గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ కూడా రాశారు. ఆయన గవర్నర్ పదవికి తగిన వారు కాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం గవర్నర్ తమిళసై బిల్లులకు ఆమోదం చెప్పడం లేదంటూ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.


More Telugu News