బాబర్ అజామ్‌కు చుక్కలు చూపిస్తున్న పాక్ మీడియా!

  • బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తారంటూ వార్తలు
  • ఈ విషయమై బాబర్‌తో పీసీబీ సీఓఓ వాట్సాప్ చాట్
  • ఈ చాట్‌ను బయటపెట్టిన టీవీ ఛానల్‌పై పాక్ లెజెండ్ వకార్ యూనిస్ ఆగ్రహం
  • మీరు ఏం సాధించాలనుకున్నారు? అంటూ సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు
వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఘోరంగా విఫలం కావడంతో ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తారన్న వార్తలూ మొదలయ్యాయి. బాబర్ అజామ్‌ ఫోన్ కాల్స్‌కు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ స్పందించలేదన్న తాజా వార్త మరింత కలకలానికి దారి తీసింది. ఈ క్రమంలో బాబర్ అజామ్, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) మధ్య జరిగిన చాట్‌ను ఓ టీవీ ఛానల్ లీక్ చేయడంతో బాబర్ మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. ఇలా పాక్ మీడియా చేతిలో బలైపోతున్న బాబర్ అజామ్‌కు పాక్ క్రికెట్ లెజెండ్ వకార్ యూనిస్ అండగా నిలిచాడు. ‘‘ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా?’’ అంటూ సదరు టీవీ ఛానల్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతడిని వదిలేయండంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయిపోయాడు.  

వివాదాలు సృష్టించడంలో సిద్ధహస్తుడైన పాక్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలతో ఈ కాంట్రవర్సీ మొదలైంది. ఆఫ్ఘనిస్థాన్‌తో ఓటమి తరువాత బాబర్ అజామ్ ఫోన్ కాల్స్‌కు పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్ స్పందించట్లేదని ఓ టీవీ షోలో అతడు చెప్పుకొచ్చాడు. అనంతరం, ఈ ఉదంతంపై ఓ టీవీ ఛానల్‌లో జరిగిన చర్చాకార్యక్రమంలో బాబర్ అజామ్, పీసీబీ సీఓఓ సల్మాన్ నసీర్ మధ్య ఈ విషయమై జరిగిన వాట్సాప్ సంభాషణను లైవ్‌లో చూపించారు.

ఈ చాట్‌లో సల్మాన్ తొలుత బాబర్‌ను టీవీలో వైరల్ అవుతున్న వార్తల గురించి ప్రశ్నిస్తాడు. ‘‘బాబర్, పీసీబీ చీఫ్ నీ ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదన్న వార్త వైరల్ అవుతోంది. నువ్వేమైనా ఆయనకు కాల్ చేశావా’’ అంటూ సల్మాన్ ప్రశ్నించాడు. దీనికి బాబర్ లేదనే జవాబిచ్చాడు. ‘‘సలాం సల్మాన్ భాయ్.. నేనైతే సార్‌కు ఫోన్ చేయలేదు’’ అని స్పష్టం చేశాడు.

కాగా, ఈ చాట్ ప్రసారం చేయడంపై వకార్ యూనిస్ మండిపడ్డాడు. ‘‘మీరు అసలు ఏం సాధిద్దామనుకున్నారు. బాబర్‌ను వేధించకండి. అతడు మన టీంకు ఎంతో కీలకం’’ అంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.


More Telugu News