కొత్త ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిలోనే 10 రోజులు ఉండాలి: యశోద ఆసుపత్రి వైద్యులు

  • చిన్న పేగు 15 సెం.మీ. మేర తొలగించి కుట్లు వేసినట్లు వెల్లడి
  • త్వరగా ఆసుపత్రికి చేరుకోవడంతో ఇన్‌ఫెక్షన్ ముప్పు తప్పినట్లు చెప్పిన వైద్యులు
  • మూడు గంటల పాటు ఆపరేషన్ జరిగిందని వెల్లడి
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని యశోద ఆసుపత్రి వైద్యులు సోమవారం వెల్లడించారు. ఆయన బొడ్డుకు కుడిభాగాన ఆరు సెంటీ మీటర్ల మేర కత్తి గాటు పడినట్లు చెప్పారు. సిటీ స్కాన్‌లో శరీరం లోపల బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. చిన్న పేగు 15 సెంటీ మీటర్ల మేర తొలగించి కుట్లు వేసినట్లు తెలిపారు. త్వరగా ఆసుపత్రికి చేరుకోవడంతో ఇన్‌ఫెక్షన్ ముప్పు తప్పినట్లు తెలిపారు. ఆయన పది రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పారు. 

వైద్యులు విజయ్ కుమార్, ప్రసాద్ బాబు మాట్లాడుతూ... కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిగాటుతో ఆసుపత్రికి వచ్చారని, గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమికంగా కుట్లు వేసి ఇక్కడకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రసాద్ బాబు, వినీత్ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించిందన్నారు. ఇంటస్టైన్‌కు గాయం ఉందని, త్వరగా ఆసుపత్రికి చేరుకోవడంతో ఇన్‌ఫెక్షన్ ముప్పు తప్పిందని వెల్లడించారు. మూడు గంటల పాటు ఆపరేషన్ జరిగిందని, లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయడం కష్టమని గుర్తించినట్లు చెప్పారు.

రెండు పేగులకు కలిపి నాలుగు చోట్ల గాయాలయ్యాయని, చిన్న పేగు 15 సెంటీ మీటర్ల మేర తొలగించి కుట్లు వేసినట్లు తెలిపారు. ఈ తరహా ఆపరేషన్ జరిగినప్పుడు రోగి త్వరగా కోలుకోవడం కష్టమన్నారు. ఎప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తామన్నారు. ఆయనకు హైపర్ టెన్షన్ ఉందని, మెడికో లీగల్ కేసు కాబట్టి అన్ని నమూనాలు సేకరించామన్నారు. నాలుగు రోజుల తర్వాత పూర్తిగా కోలుకుంటున్నారో లేదో గుర్తించి వార్డుకు షిఫ్ట్ చేస్తామన్నారు.


More Telugu News