రైలు ప్రమాద బాధితుల పరామర్శకు భువనేశ్వరి ఎందుకు వెళుతున్నట్టు... లోకేశ్ పార్టీని నడిపించడంలేదా?: సజ్జల

  • విజయనగరం జిల్లాలో రెండు రైళ్ల ఢీ... 13 మంది మృతి
  • క్షతగాత్రులకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
  • రేపు విజయనగరం వెళుతున్న భువనేశ్వరి
  • టీడీపీ దివాలా తీసినందునే భువనేశ్వరి విజయనగరం వెళుతున్నారన్న సజ్జల
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. విజయనగరం రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి వెళుతుండడం పట్ల ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు భువనేశ్వరి ఎందుకు వెళుతున్నట్టు... ఆమె టీడీపీ అధ్యక్షురాలు కావాలనుకుంటున్నారా? నారా లోకేశ్ ఎక్కడ... ఎందుకు అతడ్ని దూరం పెడుతున్నారు? అంటూ ప్రశ్నించారు. టీడీపీ అంతర్గతంగా దివాలా తీసిందని, ఈ కారణంగానే రైలు ప్రమాద బాధితుల పరామర్శకు భువనేశ్వరి వెళుతున్నారని సజ్జల పేర్కొన్నారు.

చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ నేతల చర్యలు పరాకాష్ఠకు చేరాయి!

ఇక, హైదరాబాదులో ఆదివారం రాత్రి సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ నిర్వహించడంపైనా సజ్జల విమర్శలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ నేతల చర్యలు పరాకాష్ఠకు చేరాయని అన్నారు. చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ కు 50 రోజుల  పూర్తయితే టీడీపీ నేతలు వేడుకలు జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

నిన్న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమం అంతా ముందే రిహార్సల్ చేసుకుని వచ్చినట్టుగా ఉందని అన్నారు. ప్రజలు ఏమనుకుంటారోనన్న ఇంగితం కూడా లేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఓవైపు ఏడుపులు, మరోవైపు నవ్వులతో ఎన్నికల డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.


More Telugu News