రేపు విజయనగరంలో రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న నారా భువనేశ్వరి

  • విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం 
  • రెండు రైళ్లు ఢీకొని 13 మంది మృతి
  • క్షతగాత్రులకు విజయనగరం ఆసుపత్రిలో చికిత్స
  • రేపు రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వెళ్లనున్న భువనేశ్వరి
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 13 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

కాగా, రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి రేపు (అక్టోబరు 31) విజయనగరం రానున్నారు. రైళ్లు ఢీకొన్న ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆమె పరామర్శిస్తారు. నారా భువనేశ్వరి రేపు రాజమహేంద్రవరం నుండి బయలుదేరి విజయనగరం చేరుకోనున్నారు. బాధితుల పరామర్శ అనంతరం ఆముదాలవలస వెళ్లి అక్కడ బస చేస్తారు. 

నవంబరు 1 నుంచి నారా భువనేశ్వరి మలివిడత 'నిజం గెలవాలి' కార్యక్రమం

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పర్యటించి, చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. 

తాజాగా, ఆమె మలివిడత 'నిజం గెలవాలి' కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు. నవంబరు 1 నుంచి మూడ్రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో, నవంబరు 2న విజయనగరం జిల్లాలోని ఎచ్చర్ల, బొబ్బిలి, నవంబరు 3న విజయనగరం నియోజకవర్గంలో 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొంటారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు 'నిజం గెలవాలి' సభల్లో ఆమె పాల్గొంటారు.


More Telugu News