శ్రీలంకను ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేసిన ఆఫ్ఘనిస్థాన్

  • పూణేలో వరల్డ్ కప్ మ్యాచ్
  • శ్రీలంకపై టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
  • శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్
  • 4 వికెట్లతో సత్తా చాటిన ఫజల్ హక్ ఫరూఖీ
ఆఫ్ఘనిస్థాన్ ఇక ఎంతమాత్రం చిన్న జట్టు కాదని వరల్డ్ కప్ లో ఆ జట్టు సాధించిన విజయాలతో నిరూపితమైంది. ఇవాళ శ్రీలంకతో మ్యాచ్ లోనూ ఆఫ్ఘన్ జట్టు సాధికారిక బౌలింగ్ ప్రదర్శన కనబర్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్... శ్రీలంకను 49.3 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌట్ చేసింది. 

పూణే పిచ్ పై లంక బ్యాటర్లు ఓ మోస్తరు స్కోర్లు చేశారే తప్ప, భారీ భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ లంకపై ఒత్తిడి పెంచారు. లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హక్ ఫరూఖీ అద్భుతంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. ముజీబ్ కు 2, రషీద్ ఖాన్ కు 1, అజ్మతుల్లాకు 1 వికెట్ దక్కాయి. 

లంక జట్టులో ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 46, కెప్టెన్ కుశాల్ మెండిస్ 39, సమరవిక్రమ 36, అసలంక 22, ఏంజెలో మాథ్యూస్ 23, మహీశ్ తీక్షణ 29 పరుగులు చేశారు. 

ఇక, 242 పరుగుల లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ తొలి ఓవర్లోనే ఓపెనర్ రహ్మునుల్లా గుర్బాజ్ (0) వికెట్ కోల్పోయింది. అప్పటికి స్కోరుబోర్డుపై పరుగులేమీ లేవు. లంక పేసర్ మధుశంక అద్భుతమైన బంతితో గుర్బాజ్ ను బౌల్డ్ చేశాడు. 

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 20 పరుగులు. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 9, రహ్మత్ షా 10 పరుగులతో ఆడుతున్నారు. ఆఫ్ఘన్ గెలవాలంటే ఇంకా 45 ఓవర్లలో 222 పరుగులు చేయాలి.


More Telugu News