మహిళలు వారానికి 70 గంటలకు పైగా కష్టపడుతున్నారు: ఎడెల్ వీస్ సీఈవో రాధికా గుప్తా

  • దేశ జాతీయోత్పాదకతకు యువత కష్టపడాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
  • వారానికి 70 గంటలు పనిచేయాలని పిలుపు
  • ఆఫీసులో, ఇంట్లో మహిళలు కష్టపడి పనిచేస్తున్నారన్న రాధికా గుప్తా
దేశ స్థూల జాతీయోత్పత్తికి ఊతమిచ్చేందుకు యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, నారాయణమూర్తి వెలిబుచ్చిన అభిప్రాయం పట్ల సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు నారాయణమూర్తికి మద్దతు పలుకుతున్నారు. ఇతర దేశాలతో పోటీ పడాలంటే భారత్ లో పని సంస్కృతి మారాలని వారు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు నారాయణమూర్తి అభిప్రాయాన్ని తప్పుబడుతున్నారు. 

ఈ చర్చలోకి ఎడెల్ వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో రాధికా గుప్తా కూడా ప్రవేశించారు. చాలామంది భారత మహిళలు వారానికి 70 గంటలకు పైగా పని చేస్తున్నారని, భారత్ నిర్మాణంలోనూ, తదుపరి తరానికి బాటలు వేయడంలోనూ మహిళల కష్టం ఉందని వెల్లడించారు. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో మహిళలు దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తున్నారు... అది కూడా చిరునవ్వుతో, ఓవర్ టైమ్ కోసం ఎలాంటి డిమాండ్లు చేయకుండానే వారీ పనిచేస్తున్నారు అని రాధికా గుప్తా వివరించారు. 

ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే... ఇంత చేస్తున్నా ట్విట్టర్ లో మా గురించి మాత్రం ఎవరూ మాట్లాడరు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, రాధికా గుప్తా సోషల్ మీడియా పోస్టు నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఆమె అభిప్రాయాలపై నెటిజన్ల స్పందనలు పెద్ద సంఖ్యలో వచ్చాయి.


More Telugu News