చంద్రబాబు రెండో కంటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది: హైకోర్టుకు తెలిపిన న్యాయవాదులు

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
  • నేడు వాదనలు వింటున్న న్యాయస్థానం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు చేపట్టారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించారు. 

చంద్రబాబు రెండో కంటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. ఆయన వాదనలు ఉదయమే ముగిశాయి. లూథ్రా కూడా చంద్రబాబు ఆరోగ్యపరమైన అంశాలపైనే వాదనలు వినిపించారు. 

చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తి కాగా, కాసేపట్లో మధ్యాహ్న భోజన విరామానంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్నారు. 

అటు, చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సమయం కావాలని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టును కోరారు. పొన్నవోలు విజ్ఞప్తి నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు రేపటికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.


More Telugu News