ఏపీ సర్కారు పరిమితికి మించి అప్పులు చేస్తున్నా కేంద్రం ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది?: జీవీ రెడ్డి

  • ఏపీ అప్పులపై టీడీపీ అధికార ప్రతినిధి ప్రెస్ మీట్
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్న జీవీ రెడ్డి
  • ఏపీ ఎఫ్ఆర్ బీఎం పరిమితి దాటి అప్పులు చేస్తోందని ఆరోపణ
రాష్ట్ర ఆర్థిక అంశాల్లో ఎలాంటి లొసుగులు, తప్పులు లేకపోతే, అప్పులు ఆదాయ వివరాలు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడంలేదని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలకు సంబంధించిన వాస్తవ సమాచారంతో జగన్ సర్కార్ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం అంతా పారదర్శకంగా చేస్తోందని ఆర్థికమంత్రి ఉత్తుత్తి మాటలు చెబుతున్నారని విమర్శించారు. 

"కాగ్ మొత్తుకుంటున్నా జగన్ ప్రభుత్వం ఎందుకు ఆదాయ వ్యయవివరాలు బహిర్గతం చేయడంలేదు? ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితికి మించి ఏపీ అప్పులు చేస్తున్నా... జగన్ సర్కార్ పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితికి మించి అప్పులు చేశాయని కేరళ, తెలంగాణ రాష్ట్రాలపై కన్నెర్ర చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఎందుకు ఉదాసీనతతో ఉంటోంది?" అంటూ కేంద్రం వైఖరిని కూడా జీవీ రెడ్డి నిలదీశారు. 

"రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి  నెట్టిన వైసీపీ ప్రభుత్వం, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం ఏడు నెలల్లోనే రూ.72,950 కోట్ల అప్పు చేసింది. ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితి రూ.30,275 కోట్లు అయితే, అదనంగా ప్రభుత్వం దాదాపు రూ.42 వేల కోట్లకు మించి అప్పు చేసింది. 2020-21, 2021-22, 2022-23  ఆర్థిక సంవత్సరాల మాదిరే, 2023-24లో కూడా వరుసగా ప్రభుత్వం ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితికి మించి అప్పు చేసి, ఆ సొమ్ముని ఇష్టానుసారం విచ్చలవిడిగా దుబారా చేసింది" అని వివరించారు.

“రాష్ట్ర విభజన వల్ల ఏపీకి వచ్చిన అప్పులు కలిపి, 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పు రూ.3,62,726 కోట్లు మాత్రమే. ఈ విషయం 2019 జులైలో వైసీపీ ప్రభుత్వమే శ్వేతపత్రం విడుదల చేసి మరీ చెప్పింది. 

2019లో మేలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ తన అప్పుల పరంపర కొనసాగించి, కేవలం నాలుగున్నరేళ్లలోనే రూ.7,40,476 కోట్ల అప్పుచేసింది. కేవలం ఆర్బీఐ బాండ్స్ ద్వారానే రూ.2,56,166 కోట్ల అప్పులు తెచ్చింది. ఇంత భారీగా అప్పులు తెచ్చిన జగన్ సర్కార్ రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి చేసిందా అంటే ఏమీ లేదు. ఏపీ కంటే కూడా త్రిపుర, అస్సాం వంటి చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాయని తేలింది. 

అంతా సక్రమంగా జరిగితే, 22 నెలల నుంచీ కాగ్ కు వివరాలు ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకవతవకలపై ఏపీలోని బీజేపీ నేతలు ఒకటి చెబుతుంటే... ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఇష్టానుసారం అప్పులు ఇస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఏపీకి న్యాయం చేయాలని ఉంటే, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులిచ్చి.. ఇతర ప్రయోజనాలు నెరవేర్చాలి. అంతేగానీ జగన్ సర్కార్ అడగడమే ఆలస్యమన్నట్లు అప్పులు ఇస్తుంటే, ఆ భారం మొత్తం రాష్ట్ర ప్రజలపై పడటం లేదా? ఈ వాస్తవం తెలియకుండానే కేంద్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వానికి అప్పులు ఇస్తోందా?" అంటూ జీవీ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.  



More Telugu News