తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ కీలక నిర్ణయం
  • ములాఖత్‌లో కాసాని జ్ఞానేశ్వర్‌కు స్పష్టం చేసిన చంద్రబాబు
  • ఆషామాషీగా పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే మంచిదని సూచన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ స్పష్టత ఇచ్చింది. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు అధినేత చంద్రబాబు సూచించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టు, జైలులో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని ఆ పార్టీ భావించింది. శనివారం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ములాఖత్‌ సందర్భంగా కాసానికి చంద్రబాబు సూచించారు.

చంద్రబాబుతో కాసాని ములాఖత్‌‌లో దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు కాసాని కోరగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టిసారించలేదని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని చంద్రబాబు సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే బాధపడాల్సి ఉంటుందని, ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్‌కు సర్దిచెప్పినట్లు తెలిసింది. బరిలో దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూస్తున్నారు కదా అని సర్దిచెప్పినట్టు సమాచారం.


More Telugu News