లోకేశ్ ఎఫెక్ట్ తోనే విజయసాయిరెడ్డి మీడియా ముందు పిచ్చికూతలు కూశాడు: దేవినేని ఉమా

  • చంద్రబాబుతో ములాఖత్ అనంతరం లోకేశ్ వ్యాఖ్యలు
  • తీవ్ర విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి
  • లోకేశ్ మాటలతో తాడేపల్లి కొంపలో ఆక్రందనలు మొదలయ్యాయన్న ఉమా
  • లోకేశ్ మాటలకు జగన్ వద్ద సమాధానం లేదని వెల్లడి
  • టీడీపీ అధికారంలోకి రాగానే చీకటి వ్యవహారాలన్నీ బయటికి వస్తాయని ఉద్ఘాటన 
జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైసీపీ నేతల మద్యం వ్యాపారాలపై సీబీఐ విచారణ జరిగితే ఏ1, ఏ2ల శాశ్వత నివాసం శ్రీకృష్ణ జన్మస్థానమేనని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబుని జైల్లో కలిసిన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడింది చూశాక తాడేపల్లి కొంపలో ఆక్రందనలు మొదలయ్యాయని అన్నారు. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్న జగన్ రెడ్డి.. నేడు లోకేశ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విజయసాయితో పిచ్చికూతలు కూయించాడని మండిపడ్డారు. 

"సామాజిక సాధికార బస్సుయాత్రలో... విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి పిచ్చికుక్క కరిచినవాడి కంటే దారుణంగా పిచ్చిప్రేలాపనలు పేలాడు. ప్రజల సొమ్ముని ప్రభుత్వ న్యాయవాదులకు దోచిపెడుతూ.. చంద్రబాబును జైలు నుంచి బయటకు రాకుండా చేయడం కోసం నానా అవస్థలు పడుతున్న జగన్ రెడ్డి... నేడు లోకేశ్ మీడియా ద్వారా సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 

చంద్రబాబుకి మద్దతుగా దేశంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరాభిమానాలు జగన్ రెడ్డి దాచాలనుకున్నా దాగడం లేదు. రేపు హైదరాబాద్ లో జరగబోయే గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమం నిజంగా జగన్ చెవులు చిల్లులు పడేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

రాష్ట్రంలో జరిగే మద్యం తయారీ, విక్రయాలపై సీబీఐతో విచారణ జరిపిస్తే విజయసాయి, మిథున్ రెడ్డి, జగన్ రెడ్డిల మద్యం మాఫియా మొత్తం బయటపడుతుంది. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిల డిస్టిలరీ నుంచి రోజుకి లక్ష కేసుల కల్తీ మద్యం బయటకు వస్తుంటే, 50 వేల కేసుల మద్యాన్నే లెక్కల్లో చూపుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 20 ప్రధాన డిస్టిలరీలు అన్నీ జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వారి బంధువులు, వైసీపీ నేతల కన్నుసన్నల్లోనే నడుస్తున్నాయి. 

మద్యం అమ్మకాలతో ఖజానాకు ఎంత వచ్చింది.... జగన్ కు ఎంత ముట్టిందనే వివరాలు బయటపెట్టే దమ్ము, ధైర్యం విజయ సాయిరెడ్డికి ఉన్నాయా? తన అల్లుడు శరత్ చంద్రారెడ్డిని లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేయడానికి విజయసాయిరెడ్డి ఏంచేశారో అందరికీ తెలుసు. శరత్ చంద్రారెడ్డి కోసం విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి ఏకంగా విభజన చట్టం ప్రకారం ఏపీకి దక్కాల్సిన ఆస్తులను ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టేశారు. శరత్ చంద్రారెడ్డి నోరు విప్పితే తమ బండారం బయటపడుతుందని విజయసాయి... జగన్ లు ఢిల్లీ పెద్దలతో లాలూచీ పడింది నిజం కాదా? 

తాడేపల్లి కొంపకు సీబీఐ నోటీసులు రాబోతున్నాయని తెలిసే విజయసాయిరెడ్డి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. నవంబర్ 20, 21 తేదీల్లో హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలని ఇప్పటికే తాడేపల్లి కొంపకు నోటీసులు వచ్చాయని సమాచారం. తానొక రాజ్యసభ సభ్యుడిని అనే విషయం కూడా మర్చిపోయి విజయసాయి మతిలేకుండా మాట్లాడుతున్నాడు. చంచల్ గూడా జైల్లో జగన్ తో కలిసి 16 నెలలు ఉన్నా కూడా విజయసాయిరెడ్డిలో మార్పురాలేదు. 

ఇక, వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డిని కాపాడటానికి జగన్ రెడ్డి డ్రామాలు ఆడింది నిజం కాదా విజయసాయీ? అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు కావడం, వివేకా హత్యకేసులో తాడేపల్లి కొంపలో ఉండే వారి రెండు పేర్లు బయటకు రావడం ఖాయం. 

టీడీపీ అధికారంలోకి రాగానే ఈ చీకటి వ్యవహారాలన్నీ బయటపెట్టడమే కాదు, జగన్, విజయసాయి రెడ్డిలు అడ్డగోలుగా తిన్న ప్రజల సొమ్ము మొత్తం కక్కిస్తుంది” అని దేవినేని ఉమా స్పష్టం చేశారు.


More Telugu News