అజారుద్దీన్ ఎలాంటివాడంటే..!: విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

  • దావూద్ ఇబ్రహీం సోదరుడిలాంటి వాడు అజారుద్దీన్ అని వ్యాఖ్య
  • జూబ్లీహిల్స్ అసెంబ్లీకి కాంగ్రెస్ నుంచి తానే అర్హుడినన్న విష్ణువర్ధన్ రెడ్డి
  • కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటానని వెల్లడి
కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి అన్ని విధాలా టిక్కెట్‌కు తానే అర్హుడినని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆర్టీవీ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ... కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల సర్వేల్లోను జూబ్లీహిల్స్‌లో అద్భుత విజయం దక్కుతుందని తేలిందని, కానీ హఠాత్తుగా పార్టీ అధిష్ఠానం అజారుద్దీన్‌ను తెరపైకి తీసుకు వచ్చి, టిక్కెట్ ఇచ్చిందన్నారు. తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం అందిందని, కానీ కార్యకర్తలతో మాట్లాడాకే ఏదైనా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

పార్టీ ఒకరికి టిక్కెట్ ఇచ్చింది కాబట్టి, పోటీలో ఉండాలా? వద్దా? అనే అంశంపై పార్టీ కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ మాత్రమే కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఉందన్నారు. అజారుద్దీన్ గురించి ఎక్కువగా చెప్పవద్దని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడి లాంటివాడు అజారుద్దీన్ అని విమర్శలు గుప్పించారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందన్నారు. హెచ్‌సీఏలో ఎలా అవకతవకలకు పాల్పడ్డారో జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే కూడా అలాగే చేస్తారన్నారు.

తనకు కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి ఎలాంటి బుజ్జగింపు ఫోన్లు రాలేదన్నారు. నిన్నటి వరకు తనకు టిక్కెట్ వస్తుందని నమ్మకం ఉండేదని, ఇప్పుడు ఎలాంటి ఆశలు లేవన్నారు. పార్టీ మారాలా? వద్దా? అనేది రేపు కార్యకర్తలు, అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. తనను కాపాడుకున్నది కార్యకర్తలేనని, అందుకే నేను ఏం చేయాలన్నా వారికి చెప్పి చేస్తానన్నారు. వారి నిర్ణయం ప్రకారం నడుచుకుంటానన్నారు.


More Telugu News