చంద్రబాబు వయసు, ఆరోగ్య రీత్యా ఆయనకు బదులు నన్ను జైల్లో ఉంచండి: సీఎం జగన్ కు మాగంటి బాబు విజ్ఞప్తి

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • గత 50 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్
  • చంద్రబాబు పరిస్థితి పట్ల మాజీ ఎంపీ మాగంటి బాబు తీవ్ర విచారం
  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు కలలో కనిపించారని వెల్లడి
  • జగన్ కు మంచి చెడులు చెప్పమన్నారని వివరణ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గత 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పార్టీ అధినేత పరిస్థితి పట్ల టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు బదులు తాను జైల్లో ఉంటానని, సీఎం జగన్ అందుకు అంగీకరించాలని కోరారు. ఇవాళ నూజివీడులో 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాగంటి బాబు మాట్లాడుతూ... చంద్రబాబు వయసు, ఆరోగ్యం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని, ఆయనకు బదులు తనను జైల్లో పెట్టాలని జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. 

అంతేగాకుండా, రాత్రి కలలోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చారని, తండ్రి వయసున్న చంద్రబాబుపై తన కుమారుడు జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారని మాగంటి బాబు వెల్లడించారు. జగన్ కు మంచి చెడులు చెప్పాలని తనకు వైఎస్ సూచించారని వివరించారు. 

ఇక, తండ్రి ఎన్టీఆర్, భర్త చంద్రబాబు సీఎంలుగా పనిచేసిన సమయంలో ఏనాడూ ఇల్లు దాటి బయటకు రాని నారా భువనేశ్వరి ఇవాళ ప్రజల్లోకి రావాల్సి వచ్చిందని, 'నిజం గెలవాలి' కార్యక్రమం కోసం ప్రజల్లోకి వచ్చిన ఆమెకు అందరూ మద్దతుగా నిలవాలని మాగంటి బాబు పిలుపునిచ్చారు.


More Telugu News