నారాయణ మూర్తి '70 గంటల పని సిద్ధాంతానికి' ప్రముఖ వ్యాపారవేత్త సపోర్ట్

  • ప్రధాని మోదీజీ రోజులో 14-16 గంటల పాటు కష్టపడుతున్నట్టు వెల్లడి
  • దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చాలంటే యువత కష్టపడాలన్న సూచన
  • విశ్రాంతి కంటే పనికి ప్రాధాన్యం ఇవ్వాలన్న అభిప్రాయం
  • మనం శ్రమిస్తేనే ముందు తరాలు సుఖపడతాయన్నకామెంట్
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే, యువత వారంలో 70 గంటల పాటు కష్టించి పనిచేయక తప్పదంటూ ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై భిన్నరకాల స్పందనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణమూర్తి వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతుండగా, కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో నారాయణ మూర్తి అభిప్రాయాలను ప్రముఖ వ్యాపారవేత్త, జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ సమర్థించారు.

‘‘నారాయణమూర్తి ప్రకటనను నేను హృదయపూర్వకంగా సమర్థిస్తున్నాను. ఇది కేలరీలను ఖర్చు చేయడం గురించి కాదు. ఇది అంకిత భావం గురించి. మనం మన దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చాలి. అప్పుడు అది మనందరికీ గర్వకారణం అవుతుంది’’ అని సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేశారు. 

‘‘వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశ పరిమాణానికి వారంలో ఐదు రోజుల పని సంస్కృతి అనుకూలం కాదు. మన ప్రధాని నరేంద్ర మోదీజీ రోజులో 14-16 గంటల పాటు కష్టపడుతున్నారు. మా తండ్రి వారంలో ఏడు రోజుల పాటు, రోజుకి 12-14 గంటల చొప్పున కష్టపడేవారు. నేను కూడా రోజులో 10-12 గంటల పాటు పనిచేస్తుంటాను. జాతి నిర్మాణానికి, మన పని పట్ల మనకు ప్యాషన్ ఉండాలి’’ అని సజ్జన్ జిందాల్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

మరో ట్వీట్ లో ‘‘మన పరిస్థితులు ప్రత్యేకమైనవి. మనం ఎదుర్కొంటున్న సవాళ్లు, అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు పూర్తిగా భిన్నమైనవి. ముందు తరాలు మరింత ఉత్పాదకత కోసం ఎక్కువ గంటల పాటు శ్రమించడం వల్లే, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో వారానికి 4-5 రోజులు పని చేస్తే సరిపోతోంది. కనుక తక్కువ పని గంటలు మనకు అనుకూలం కాదు’’ అని చెప్పారు.

‘‘మన దేశానికి ఉన్న గొప్ప బలం మన యువతే. సూపర్ పవర్ గా మన దేశం అవతరించే క్రమంలో యువతరం విశ్రాంతి కంటే పనికి ప్రాధాన్యం ఇవ్వాలి. మనం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, సౌకర్యానికి బాటలు పరుచుకుంటాయి. మనం చేసి త్యాగాల ఫలితాలను 2047 నాటికి అప్పటి యువత అనుభవిస్తుంది’’ అని సజ్జన్ జిందాల్ వివరించారు.


More Telugu News