భారత్ తో టీ20 పోరుకు స్క్వాడ్ ను ప్రకటించిన ఆస్ట్రేలియా

  • కెప్టెన్ గా మ్యాథ్యూ వేడ్ 
  • వార్నర్, స్మిత్, మ్యాక్స్ వెల్ కు చోటు
  • ప్యాట్ కమిన్స్, హేజిల్ వుడ్, ఆడమ్ జంపాకు విరామం
  • నవంబర్ 23న వైజాగ్ లో తొలి టీ20
ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా ఆలస్యంగా అయినా గాడిన పడింది. వరుసగా రెండు ఓటములు చవిచూసిన తర్వాత తేరుకున్న ఆస్ట్రేలియా, తర్వాతి మూడు మ్యాచుల్లో విజయం నమోదు చేసింది. ఇక ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్ తో టీ20 పోరుకు ఆస్ట్రేలియా సన్నాహాలు మొదలు పెట్టేసింది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత్ తో మొదలయ్యే ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం 14 మందితో కూడిన బృందాన్ని శనివారం ప్రకటించింది. 

టీ20 కెప్టెన్ గా మాథ్యూ వేడ్ ను ఖరారు చేసింది. చివరిగా అతడు గతేడాది సొంత గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ లో పాల్గొన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ గా పనిచేస్తున్న ప్యాట్ కమిన్స్ కు విశ్రాంతి ఇచ్చారు. అలాగే, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్ ను సైతం టీ20 జట్టులోకి ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు సారథిగా పనిచేసిన మిచెల్ మార్ష్ కు కూడా విశ్రాంతి ఇచ్చారు. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు కూడా విరామం ఇచ్చారు.

మాథ్యూవేడ్ తోపాటు, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్, ట్రావిస్ హెడ్ లను టీ20 బృందంలోకి తీసుకున్నారు. నాథన్ ఎల్లిస్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జాసన్ బెహ్రెన్ డార్ఫ్, స్పెన్సర్ జాన్సన్, సియాన్ ఎబాట్, మ్యాట్ షార్ట్, జోష్ ఇంగ్లిష్, టిమ్ డేవిడ్, తన్వీర్ సంఘా ను ఎంపిక చేశారు. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నవంబర్ 23న వైజాగ్ లో మొదలు కానుంది. 26న తిరువనంతపురం, 28న గువాహటి, డిసెంబర్ 1న నాగ్ పూర్, డిసెంబర్ 3న హైదరాబాద్ లో మిగిలిన మ్యాచ్ లు జరుగుతాయి. టీ20 సిరీస్ కు భారత బృందాన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.


More Telugu News