ఆ రనౌట్‌తోనే వీడ్కోలు పలికాను.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న ఎంఎస్ ధోనీ

  • 2019 వరల్డ్ కప్‌లో కివీస్‌పై సెమీస్ మ్యాచ్‌లో రనౌట్‌తో రిటైర్మెంట్ నిర్ణయం
  • రనౌట్ అవ్వగానే మనసులో ప్రణాళిక
  • అంతర్జాతీయ క్రికెట్‌లో అదే చివరి రోజని భావించానని వెల్లడి
భారత క్రికెట్‌‌కు విశేష సేవలు అందించడంతోపాటు అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మూడేళ్లక్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆగస్టు 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచన తనలో ఏ సందర్భంలో వచ్చిందో ధోనీ తాజాగా వెల్లడించాడు.

2019 వన్డే ప్రపంచ కప్ సమరంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సెమీస్ మ్యాచ్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా 240 పరుగుల లక్ష్య ఛేదనలో అత్యంత కీలక దశలో ఎంఎస్ ధోనీ రనౌట్ కావడం చాలామందికి కళ్లల్లో కదులుతూనే ఉంటుంది. ఈ రనౌటే రిటైర్మెంట్‌ ఆలోచనలు పుట్టించిందని ఎంఎస్ ధోని బయటపెట్టాడు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ ఈ విషయాలను వెల్లడించాడు. 

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అదే తనకు చివరి రోజని ఆ రనౌట్‌తోనే అర్థమైందని, ఆ సమయంలోనే రనౌట్ అయ్యానని ఝార్ఖండ్ డైనమైట్ తాజాగా వెల్లడించాడు. విజయానికి సమీపించి ఓటమిపాలైతే ఎమోషన్స్‌ని నియంత్రించుకోవడం చాలా కష్టమని భావోద్వేగంగా స్పందించాడు. దాదాపు 15 ఏళ్లపాటు క్రికెట్ ఆడిన తర్వాత ఇక దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశంలేదని అర్థమైనప్పుడు భావోద్వేగాలు అదుపులో ఉండవని వివరించాడు. రనౌట్ అవ్వగానే మనసులోని తన ప్రణాళికలను పూర్తి చేసుకున్నానని, ఆ రోజే చివరిదని అనుకున్నానని గుర్తుచేశాడు. ఆ మ్యాచ్ జరిగిన సంవత్సరం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించినా తన మనసుకు మాత్రం కివీస్‌తో మ్యాచ్ చివదని భావించానని అన్నాడు.


More Telugu News