మూలకు కూర్చుంటే స్నేహితుడు కదా అని పిలిచి మంత్రిని చేశా: తుమ్మలపై కేసీఆర్ నిప్పులు

  • తానేదో అన్యాయం చేసినట్లు తుమ్మల అసత్య ప్రచారం చేస్తున్నారన్న కేసీఆర్
  • పాలేరు ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నామని వ్యాఖ్య 
  • బీఆర్ఎస్‌కు తుమ్మల అన్యాయం చేశారా? తుమ్మలకు పార్టీ అన్యాయం చేసిందా? అని ప్రశ్న
  • పూటకో పార్టీ మారే నేతలను నమ్మవద్దన్న ముఖ్యమంత్రి
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ... పూటకో పార్టీ మారేవారిని ఏమాత్రం నమ్మవద్దన్నారు. తాను ఏదో అన్యాయం చేసినట్లు తుమ్మల ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ మీద ఓడిపోయిన తుమ్మల... ఆ తర్వాత మూలకు కూర్చుంటే స్నేహితుడనే ఉద్దేశ్యంతో తాను పిలిచి ఆయనకు మంత్రి పదవిని ఇచ్చానని, ఎమ్మెల్సీని చేశానన్నారు. ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నిక వస్తే టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నామన్నారు.

అయిదేళ్ల పాటు ఖమ్మం జిల్లా మీద ఏకఛత్రాదిపత్యం ఇస్తే ఆయన పార్టీకి చేసిందేమీ లేదని, గుండుసున్నా అన్నారు. ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా చేశారన్నారు. మరి ద్రోహం చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు తుమ్మల అన్యాయం చేశారా? తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా? అని నిలదీశారు. ఇదంతా మన కళ్లముందే జరిగిందని, కానీ బీఆర్ఎస్‌పై అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి అరాచక రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.

కేసీఆర్ వల్లే పాలేరుకు మోక్షం లభించిందని ఇదివరకు చెప్పిన నాయకులు ఇప్పుడు ఉల్టా మాట్లాడుతున్నారన్నారు. నిజం నిప్పులాంటిదని, సత్యం ఎప్పటికీ మారదన్నారు. కొంతమంది పదవుల కోసం పార్టీలు మారుతారని, మాటలు మారుస్తారని అలాంటి వారిని నమ్మవద్దన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు, రైతుబంధు, రైతు బీమా, ఇరవై నాలుగు గంటల విద్యుత్‌తో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో ఏ పాలకులు రైతులకు రూపాయి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే కనుక రైతుబంధు, దళితబంధు ఉండవన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఉండాలా? వద్దా? అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.


More Telugu News