దేశం కోసం కాదు.. సొంత ప్రతిష్ఠ కోసం ఆడుతున్నట్టుంది..: గంభీర్

  • ఇంగ్లండ్ క్రికెటర్ల తీరును తప్పుబట్టిన గంభీర్
  • స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్య
  • గెలిపించే బ్యాటర్ ఒక్కడూ లేడంటూ విమర్శ
  • శ్రీలంక బౌలింగ్ కు ప్రశంసలు
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్ల తీరుపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శలు కురిపించాడు. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగ్గా, ఇందులో ఇంగ్లండ్ తేలిపోవడం తెలిసిందే. టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 156 పరుగులకే చాప చుట్టేసింది. తదుపరి శ్రీలంక కేవలం 25 ఓవర్లకే విజయాన్ని ఖరారు చేసింది. దీనిపై స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో చర్చా కార్యక్రమంలో గంభీర్ పాల్గొన్నాడు. ఇంగ్లండ్ చెత్తగా బ్యాటింగ్ చేసిందా లేక శ్రీలంక గొప్పగా బౌలింగ్ చేసిందా? అన్న ప్రశ్నకు గంభీర్ తనదైన శైలిలో బదులిచ్చాడు.

ఇంగ్లండ్ ఓటమికి ఈ రెండింటినీ కారణాలుగా గంభీర్ పేర్కొన్నాడు. ఆరంభం నుంచి ఇంగ్లండ్ బ్యాటర్ల తీరును గమనిస్తే వారికి పెద్దగా ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదన్నాడు. మొత్తం యూనిట్ లో గెలిపించే బ్యాటర్ ఒక్కడూ లేడని వ్యాఖ్యానించాడు. ‘‘మా స్టయిల్ ఇంతే. ఎంపిక చేయడమా? లేక చేయకపోవడమా? అన్నది మీ ఇష్టం అన్నట్టు ఆటగాళ్లు వ్యవహరిస్తున్నారు. అంటే మీరు పూర్తిగా స్వార్థపరులు. బృందంగా ఆడే ఏ ఆటలో అయినా స్వార్థానికి చోటు లేదు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత పేరు కోసమే తప్ప, దేశం కోసం ఆడుతున్నట్టుగా లేదు’’ అని గంభీర్ విశ్లేషించాడు. 

ఇంగ్లండ్ టాప్ స్కోరర్ బెన్ స్టోక్స్ పైనా గంభీర్ విమర్శలు చేశాడు. దూకుడుగా బ్యాటింగ్ చేయడాన్ని తప్పుబట్టాడు. 48, 49వ ఓవర్ వరకు బ్యాటింగ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ప్రస్తావించాడు. ‘‘మొదటి ఏడు ఓవర్లను గమనిస్తే ఇంగ్లండ్ జట్టు 350 లేదా 400 స్కోర్ చేస్తుందన్నట్టుగా అనిపించింది. జోరూట్ అవుటైన తర్వాత ఏ ఒక్కరూ విజయం కోసం ఆడినట్టుగా లేదు’’ అని పేర్కొన్నాడు.


More Telugu News