ప్రపంచకప్ సమయంలో కోహ్లీ తీసుకుంటున్న ఫుడ్స్

  • వెగాన్ కావడంతో మాంసం ముట్టని కోహ్లీ
  • ప్లాంట్ ఆధారిత మీట్, టోఫు, సోయాలకు ప్రాధాన్యం
  • రాగి దోశలను లాగిస్తున్న టీమిండియా ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ లో మంచి ప్రదర్శన చేస్తూ, టీమిండియా అభిమానులకు కప్పుపై ఆశలు పెంచుతుండడం చూస్తున్నాం. వన్డే ప్రపంచకప్ లో భారత్ ఆడిన ఐదు మ్యాచ్ లలో కోహ్లీ ఒక్కడే 354 పరుగులు చేశాడు. ప్రపంచకప్ కు ముందు ఫామ్ కోల్పోయిన కోహ్లీ, తనపై నమ్మకం ఉంచినందుకు పూర్తి న్యాయం చేస్తున్నట్టుగా, చెలరేగి ఆడుతున్నాడు. కోహ్లీ ఇంతగా రాణించడం వెనుక ఫిట్ నెస్ సూత్రాలూ దాగి ఉన్నాయి. ఈ సమయంలో కోహ్లీ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాడనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఈ వివరాలను ఓ చెఫ్ బయటపెట్టాడు.

కోహ్లీ ఎలాంటి ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నాడనే వివరాలను టీమిండియా బస్ చేసిన హోటల్ చెఫ్ పంచుకున్నాడు. ప్రపంచకప్ సమయంలో అధిక ప్రొటీన్, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని భారత ఆటగాళ్లు తీసుకుంటున్నారు. కొందరు గ్రిల్డ్ ఫిష్, చికెన్ తీసుకుంటున్నారు. కోహ్లీ వెగాన్. దీంతో అతడు టోఫు, సోయా పదార్థాలను తీసుకుంటున్నట్టు లీలా ప్యాలెస్ హోటల్ చెఫ్ అన్షుమన్ బాలి వెల్లడించారు. 

‘‘విరాట్ మాంసం తినడు. దాంతో ఉడకబెట్టిన పదార్థాలు తీసుకుంటున్నాడు. డిమ్ సమ్స్, సోయా, మాక్ మీట్, టోఫు వంటివి తింటున్నాడు’’ అని తెలిపారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు అయితే కర్రీలకు దూరంగా ఉంటున్నారు. దేవాన్ కాన్వే మాత్రం దోశ, పరాటాలను ఇష్టంగా తింటున్నట్టు చెఫ్ బాలి వెల్లడించారు. టీమిండియా ఆటగాళ్లు రాగి దోశలను సైతం ఇష్టంగా తింటున్నారు. మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ, క్వినోవా ఇడ్లీలను సైతం మెనూలో భాగంగా అందిస్తున్నారు.


More Telugu News