వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. ఏ సిరీస్‌‌కు అంటే..!

  • ప్రస్తుత వరల్డ్ కప్‌తో ముగియనున్న కాంట్రాక్ట్
  • ఆస్ట్రేలియా సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా ‘వెరీ వెరీ స్పెషలిస్ట్’
  • ద్రావిడ్ మళ్లీ దరఖాస్తు చేసుకోకుంటే లక్ష్మణ్‌కు పూర్తి పగ్గాలు!
ప్రపంచకప్ 2023లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియాను నడిపిస్తున్న కోచ్ రాహుల్ ద్రావిడ్ బాధ్యతలను నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ చేపట్టే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాతో ఆడబోయే టీ20 సిరీస్‌కు లక్ష్మణ్ ఈ బాధ్యతలు తీసుకోనున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. వరల్డ్ కప్ మెగా టోర్నమెంట్ ముగిశాక ద్రావిడ్ విరామం తీసుకోనున్నట్లు సమాచారం. అంతేకాకుండా కోచ్‌గా ద్రావిడ్ కాంట్రాక్టు ప్రపంచ కప్ 2023 తర్వాత ముగిసిపోనుంది.

ఈ పరిణామాలతో ప్రపంచ కప్ తర్వాత ఆసీస్‌తో ఆడబోయే టీ20 సిరీస్‌కు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయని పీటీఐ రిపోర్ట్ పేర్కొంది. రాహుల్ ద్రావిడ్‌కి విరామం అవసరమైన ప్రతిసారీ వీవీఎస్ లక్ష్మణే ఈ బాధ్యతలు చేపట్టారు, కాబట్టి ప్రపంచ కప్ తర్వాత కూడా ఇదే జరగనుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్టు ప్రస్తావించింది. 

కాగా.. భారత జట్టుతో రాహుల్ ద్రావిడ్ రెండేళ్ల కోచింగ్ కాంట్రాక్ట్ 2023 వన్డే ప్రపంచ కప్‌తో ముగియనుంది. 2021లో టీ20 ప్రపంచ కప్ తర్వాత రవిశాస్త్రి నుంచి బాధ్యతలు స్వీకరించాడు. ద్రావిడ్ హయాంలో టీమిండియా సాధించిన ప్రధాన విజయాల్లో ఆసియా కప్‌ ఒకటిగా ఉంది. ఇక ప్రస్తుత 2023 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతోపాటు టీ20 ప్రపంచ కప్ 2022లో సెమీఫైనలిస్ట్‌గా భారత్ నిలిచింది. తదుపరి ద్రావిడ్ పదవీకాలాన్ని పొడిగిస్తారా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. ద్రావిడ్ మళ్లీ దరఖాస్తు చేసుకోకుంటే లక్ష్మణ్ పూర్తికాల కోచ్‌గా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు సిరీస్‌లకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం కూడా అతనికి ఉంది.


More Telugu News