శ్రీలంక మీద ఓడిన ఇంగ్లండ్‌కు భారీ షాక్.. పాయింట్ల పట్టికలో సమీకరణం ఇదీ

  • శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్
  • మరింతగా సన్నగిల్లిన టాప్-4 అవకాశాలు
  • సెమీస్ అవకాశాలు దాదాపు ముగిసినట్టేనని విశ్లేషణలు
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రస్తుత వరల్డ్ కప్‌లో చెత్త ఆటను కొనసాగిస్తోంది. వరుస ఓటముల పరంపర నుంచి తప్పించుకోలేకపోతోంది. తాజాగా నాలుగవ ఓటమిని కూడా మూటగట్టుకోవడంతో ఆ జట్టు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. గురువారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ చివరి నుంచి రెండో స్థానానికి దిగజారింది. ప్రస్తుతం రెండంటే 2 పాయింట్లు మాత్రమే ఈ జట్టు ఖాతాలో ఉన్నాయి. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా ఒక విజయమే సాధించింది. ఆ జట్టు రన్‌రేట్ -1.634గా ఉంది. దీంతో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు దాదాపు ముగిసిపోయినట్టేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు

ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్‌లను భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్‌లతో ఆడనుంది. ఆతిథ్య భారత్‌, ఐదుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియాలు మంచి ఫామ్‌లో ఉన్నాయి. దీంతో ఈ జట్లపై గెలుపు ఇంగ్లిష్ జట్టుకు అంత సులభంగా ఉండకపోవచ్చు. దీంతో ఆ జట్టు సెమీఫైనల్ అవకాశాలు దాదాపు గల్లంతు అయినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలావుండగా ఇంగ్లండ్‌పై గెలుపుతో శ్రీలంక పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి ఎగబాకింది. 5 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలతో 4 పాయింట్లతో ఉంది. ఇక భారత్(10 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు), న్యూజిలాండ్ (8 పాయింట్లు), ఆస్ట్రేలియా (6 పాయింట్లు) వరుస 4 స్థానాల్లో ఉన్నాయి.


More Telugu News