జనసేనతో పొత్తు, ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్‌తో కలయికపై కిషన్ రెడ్డి స్పందన

  • ఎన్డీయేలో జనసేన భాగస్వామి కాబట్టే కలిసి ముందుకు సాగే ఆలోచన అన్న కిషన్ రెడ్డి
  • జాతీయ నాయకత్వంతో మాట్లాడాక పొత్తు అంశంపై స్పష్టత వస్తుందని వెల్లడి
  • ఏపీలో జనసేనతో పొత్తు, రాజకీయ అంశాలు అక్కడి నాయకత్వం చూసుకుంటుందన్న కిషన్ రెడ్డి
ఎన్డీయేలో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన భాగస్వామి కాబట్టే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ముందుకు సాగే ఆలోచన చేస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురువారం స్పష్టం చేశారు. జాతీయ నాయకత్వంతో మాట్లాడిన అనంతరం జనసేనతో పొత్తు అంశంపై స్పష్టత వస్తుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో తమ పార్టీ పొత్తు, రాజకీయ అంశాలపై ప్రశ్నించగా, అది ఆ రాష్ట్రంలోని తమ నాయకత్వం చూసుకుంటుందన్నారు. ఇక్కడ మాత్రం జనసేనతో కలిసి వెళ్తామన్నారు. నవంబర్ 1న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉందని, ఆ రోజున మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంపై చర్చిస్తామన్నారు.

బీజేపీ ఇప్పటికే 119 నియోజకవర్గాలకు గాను 52 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 30 స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపిస్తోంది. ఇందులో ఎక్కువగా బీజేపీ బాగా కోరుకుంటున్న స్థానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది? అనే అంశం ఆసక్తికరంగా మారింది.


More Telugu News