బీజేపీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై రఘునందనరావు కీలక ప్రకటన!

  • పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలన్న రఘునందనరావు
  • ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌ను గజ్వేల్ ప్రజలు ఓడిస్తారనే భయంతోనే కామారెడ్డి వెళ్లారన్న రఘునందనరావు
  • 55 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు... ఒక శాతం లేని వర్గానికి నాలుగా? అని ప్రశ్న
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి అవుతారని దుబ్బాక ఎమ్మెల్యే, ఆ పార్టీ నేత రఘునందనరావు కీలక ప్రకటన చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన విజయశంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ... పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దసరా పండుగ పోయి మూడ్రోజులైనా అధికార పార్టీ... గొర్రెలను కోసి బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా ధావత్‌లు ఇస్తోందన్నారు. ఫాంహౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్‌ను గజ్వేల్ ప్రజలు ఓడిస్తారనే భయంతోనే కామారెడ్డికి పారిపోయాడన్నారు.

గజ్వేల్‌లో పేదలకు డబుల్ బెడ్రూం రాలేదని, గరిబోల్ల భూములు గుంజుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుని నాటి కలెక్టర్ ఎమ్మెల్సీ అయ్యాడని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచం గర్వించదగ్గ నాయకుడని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రస్తుతం జనాభాలో 55 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు ఇస్తే, ఒక్క శాతం కూడా లేని కేసీఆర్ వర్గానికి 4 పదవులా? అని ప్రశ్నించారు.

ఆరడుగుల బుల్లెట్‌లో మందు అయిపోయిందని, ఖాళీ బుర్ర మిగిలిందని హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు. ఆ ఖాళీ బుర్రకు బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ చెప్పిందే చేస్తుందని, మోసం చేయడం, బీజేపీకి తెలియదన్నారు. హుజూరాబాద్‌లో ఈటలను ఓడించడానికి ఇంటికి 10 లక్షలు ఇచ్చిన కేసీఆర్, గజ్వేల్‌లో ఇచ్చాడా? అని ప్రశ్నించారు. ఊళ్లలో చిన్నచిన్న వాటికి పోలీసులు కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులు అంటే తమకు విభేదాల్లేవన్నారు. పైసల మంత్రి పైసల సూట్ కేసులతో వస్తాడని, జాగ్రత్తగా ఉండాలన్నారు. 10 వేల కోట్ల లిక్కర్ ఆదాయాన్ని 50 వేల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. గజ్వేల్‌లో కారు పంచర్.. కమల వికాసం ఖాయమన్నారు.


More Telugu News