చంద్రబాబుకు 4 నెలల కిందట ఒక కంటికి ఆపరేషన్ జరిగింది... ఇప్పుడు మరో కంటికి ఆపరేషన్ చేయాలి: చినరాజప్ప

  • రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
  • చంద్రబాబు కంటి ఆరోగ్యంపై టీడీపీ నేతల్లో ఆందోళన
  • చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందన్న చినరాజప్ప
  • మరో ఆపరేషన్ అవసరం లేదని జైలు అధికారులు ఎలా చెబుతారని ఆగ్రహం
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు కంటి ఆరోగ్యం పట్ల టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై మాజీ హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. చంద్రబాబుకు 4 నెలల కిందట ఓ కంటికి ఆపరేషన్ నిర్వహించారని వెల్లడించారు. ఇది క్యాటరాక్ట్ ఆపరేషన్ అని, మూడు నెలల లోపు మరో కంటికి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని వివరించారు. ఇది డాక్టర్లు చెప్పిన మాట అని, కానీ జైలు అధికారులు చంద్రబాబు కంటి ఆరోగ్యం బాగానే ఉంది అనడం హేయమైన విషయం అని చినరాజప్ప తీవ్రంగా విమర్శించారు. 

"ఎలాంటి తప్పు చేయని చంద్రబాబును 48 రోజులుగా జైల్లో ఉంచారు. చంద్రబాబు తప్పు చేశాడనడానికి ఆధారాలు దొరకడంలేదని, ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామని సజ్జల కూడా చెప్పాడు. చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని, ఆయన బలహీనంగా ఉన్నాడని చాలాసార్లు చెప్పాం. జైలు అధికారులు, పోలీసులు సజ్జల డైరెక్షన్ లో నడుస్తున్నారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ అవసరంలేదని జైలు సూపరింటిండెంట్ కూడా చెబుతున్నాడు. ఆపరేషన్ అవసరం ఏంటో, దాని బాధ ఏంటో రోగికి తెలుస్తుంది కానీ వీళ్లకేం తెలుస్తుంది? చంద్రబాబు ఆరోగ్యంపై ఏదన్నా జరిగితే అధికారులదీ, ముఖ్యమంత్రిదీ, సజ్జలదే బాధ్యత" అని చినరాజప్ప స్పష్టం చేశారు.


More Telugu News