ప్రపంచంలో రైతుబంధు అనే పదం పుట్టించిందే నేను: సీఎం కేసీఆర్

  • 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేవారంతా కేసీఆర్‌లేనని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ఓడిపోతే ప్రజలకు నష్టమన్న కేసీఆర్
  • తాను ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో ప్రజలకు తెలుసునన్న కేసీఆర్
  • దళితబంధును తీసుకు వచ్చిందే తాను అన్న కేసీఆర్
ఓడిపోతే తనకు వచ్చే నష్టమేమీలేదని, ప్రజలే నష్టపోతారని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. గురువారం వనపర్తి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఇరవై ఏళ్ల క్రితం పిడికెడు మందితో తాను ఉద్యమాన్ని ప్రారంభించానన్నారు. నాడు తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నది ఎవరు? అని ప్రశ్నించారు. అప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో... ఎవరు ఎవరి బూట్లు మోస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ఇప్పుడేమో కొడంగల్ రమ్మని ఒకరు.. గాంధీ బొమ్మ వద్దకు రావాలని మరొకరు సవాల్ విసురుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ నాయకులు పాలమూరు ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వలసల వనపర్తిని తాము వరి పంటల వనపర్తిగా మార్చామన్నారు. ముస్లింలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందన్నారు. కానీ తాము మాత్రం వారి సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేవారంతా కేసీఆర్లే అన్నారు. తానూ రైతునేనని, రైతు బంధును, దళిత బంధు అనే పదాలు పుట్టించి.. దేశానికి పరిచయం చేసిందే తాను అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రపంచంలోనే రైతుబంధు అనే పదాన్ని పుట్టించింది ఈ కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్ హయాంలో మీటర్లు, మోటార్లు గుంజుకుపోయిన సందర్భాలు ఉన్నాయని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు రైతులు కట్టాల్సిన కరెంట్ బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి తాను వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ఎందుకంటే తమ పార్టీ నుంచి పోటీ చేసేవారంతా కేసీఆర్‌లే అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందెవరు? తెలంగాణ కోసం కొట్లాడిందెవరో ప్రజలు ఆలోచించాలన్నారు.


More Telugu News