స్వయంగా రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పారు: మంత్రి హరీశ్ రావు

  • రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడమేమిటని నిలదీత
  • కర్ణాటకలో కాంగ్రెస్ రైతులకు ఐదు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తోందని విమర్శ
  • రైతుబంధు అందకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపణ
  • డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారన్న హరీశ్ రావు
రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడమేమిటని బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు నిలదీశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఉచిత కరెంట్ అని గతంలో చెప్పి ఉత్త కరెంట్ చేసిందన్నారు. అన్నదాతలపై ఆ పార్టీకి కనికరం లేదని, కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడి రైతులకు కేవలం ఐదు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తోందన్నారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 61 లక్షలమంది రైతులు కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు చేస్తారన్నారు. రైతు బంధు అనేది కొత్త పథకమేమీ కాదని, కానీ ఇప్పటి వరకు పదకొండుసార్లు అందించామని, మరోసారి ఇవ్వబోతుంటే ఈసీకి ఫిర్యాదు చేయడం విడ్డూరమన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం చెబుతారన్నారు. రైతుబంధును నిలిపివేయాలని ఈసీని కాంగ్రెస్ ఎలా కోరుతుంది? అని ప్రశ్నించారు.

రైతుబంధు అందకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా మూడు గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారని మండిపడ్డారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారన్నారు. గత ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోలేదని, తాము పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్లు, కేసీఆర్ కిట్ ఆపుతారేమో అని విమర్శించారు. రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. కర్ణాటక రైతులు కొడంగల్, గద్వాలలో కరెంట్ విషయంలో ఆందోళన చేశారన్నారు.


More Telugu News