ఉన్నట్టుండి స్వదేశానికి వెళ్లిపోయిన బంగ్లాదేశ్ కెప్టెన్

  • ఢాకాలోని స్టేడియంలో అబిదీన్ నేతృత్వంలో శిక్షణ
  • మూడు రోజుల పాటు శిక్షణ అనంతరం కోల్ కతాకు ప్రయాణం
  • వన్డే ప్రపంచకప్ లో బ్యాట్ తో రాణించలేకపోతున్న బంగ్లా కెప్టెన్
కీలకమైన వన్డే ప్రపంచకప్ టోర్నమెంటులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ షేక్ ఆల్ హసన్ ఉన్నట్టుండి స్వదేశానికి వెళ్లిపోయాడు. తనకు మార్గదర్శి అయిన నజ్ముల్ అబిదీన్ ఫహీమ్ వద్ద శిక్షణ తీసుకునేందుకు వెళ్లినట్టు తెలిసింది. అది కూడా మరో రెండు రోజుల్లో నెదర్లాండ్స్ తో మ్యాచ్ జరగనుందనగా, బంగ్లాదేశ్ కెప్టెన్ భారత్ ను వీడడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నెల 28న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నెదర్లాండ్స్ తో బంగ్లాదేశ్ పోటీ పడనుంది. 

గత మంగళవారం వాంఖడే స్టేడియంలో బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా చేతిలో 149 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రాణించలేదు. ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో పేర్కొన్న సమాచారం ప్రకారం.. షేక్ అల్ హసన్ నేరుగా బంగ్లా నేషనల్ స్టేడియంకు చేరుకున్నాడు. అక్కడ అబిదీన్ ఫహీమ్ తో కలసి సాధనలో పాల్గొన్నాడు. మూడు గంటల పాటు నెట్స్ లో సాధన చేశాడు. ‘‘అతడు ఈ రోజే వచ్చాడు. మూడు రోజుల పాటు అతడికి శిక్షణ ఇవ్వనున్నాం. తర్వాత అతడు కోల్ కతాకు వెళ్లిపోతాడు. అతడు ఈ రోజు బ్యాటింగ్ సాధన చేశాడు’’ అని ఫహీమ్ పేర్కొన్నాడు. 

36 ఏళ్ల హాసన్ వన్డే ప్రపంచకప్ లో బ్యాట్ తో ఇబ్బంది పడుతున్నాడు. గొప్ప  ప్రదర్శన ఇచ్చింది కూడా లేదు. ఇప్పటి వరకు నాలుగు ఇన్నింగ్స్ లలో కేవలం 56 పరుగులు నమోదు చేశాడు. దీంతో అతడికి శిక్షణ అవసరమని భావించి స్వదేశానికి రప్పించి ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది.


More Telugu News