మంత్రి రోజాపై రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు
- భువనేశ్వరిపై రోజా వ్యాఖ్యలను ఖండించిన రఘురాజు
- రోజా తీరును ఏ మహిళా హర్షించదని వ్యాఖ్య
- వైఎస్ మరణించినప్పుడు 1,500 మంది చనిపోయారనేది బోగస్ అన్న రఘురాజు
టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుపట్టారు. కష్టాల్లో ఉన్న ఒక మహిళ దేవుడిని దర్శించుకుంటే... దానిపై కూడా రోజా సెటైర్లు వేయడమనేది ఆమె ఎంత అక్కసుతో మాట్లాడుతోందనే విషయాన్ని తెలియజేస్తోందని రఘురాజు విమర్శించారు. రోజా వ్యవహరిస్తున్న తీరును ఏ మహిళ కూడా హర్షించదని చెప్పారు. భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతారని అన్నారు.
గతంలో వైఎస్ మరణించినప్పుడు వెయ్యి నుంచి 1,500 మంది చనిపోయినట్టుగా తమ వైసీపీ పార్టీ చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని రఘురాజు విమర్శించారు. ఆ మరణాలు బోగస్ అని ఒప్పుకోవాలని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో కలత చెందిన అనేక మంది మృతి చెందడం నిజమని చెప్పారు. టీడీపీ నాయకులు కూడా తప్పుడు లెక్కలు చెప్పాలనుకుంటే... వెయ్యి నుంచి 1,500 మంది మృతి చెందారని తప్పుడు లెక్కలు చెప్పేవారని అన్నారు.
వైసీపీ బీసీ మంత్రులు సామాజిక సాధికారత యాత్ర పేరుతో మూడు ప్రాంతాల్లో యాత్రలు చేపడతామంటున్నారని రఘురాజు ఎద్దేవా చేశారు. డాక్టర్ సుధాకర్ మరణం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, దళిత యువకుడికి శిరోముండనం కేసు, హెల్మెట్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని చంపేయడం, సోదరిని వేధించవద్దని కోరిన బాలుడిని కాల్చి చంపడం వంటి కేసుల్లో ఎలాంటి శిక్షలు విధించారో మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు.