బస్ టిక్కెట్‌కు డబ్బులు లేక పాత సైకిల్‌పై కాలేజీకి వెళ్లా: ఇస్రో చీఫ్ సోమనాథ్

  • మలయాళంలో ఎస్.సోమనాథ్ రాసిన ఆత్మకథ నవంబర్‌లో విడుదల
  • తన జీవితంలో పలు మజిలీలను అక్షరబద్ధం చేసిన ఇస్రో చీఫ్ 
  • కష్టాల్లోనూ కలలను నిజం చేసుకోవచ్చనే స్ఫూర్తిని నింపేందుకే ఈ ఆత్మకథ అని వివరణ
చంద్రయాన్-3 మిషన్ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్.సోమనాథ్ స్వయంగా రచించిన ఆయన ఆత్మకథ ఈ నవంబర్‌లో విడుదల కానుంది. తన మాతృభాష మలయాళంలో ఈ పుస్తకాన్ని రాసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తాను చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపారు. అవన్నీ పుస్తకంలో అక్షర బద్ధం చేసినట్టు వివరించారు. 

‘ఈ పుస్తకం ద్వారా నా జీవన ప్రయాణంలో జరిగిన విషయాలను పాఠకులకు వివరించడం నా ఉద్దేశం కాదు. జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూనే తమ తమ స్వప్నాలను సాకారం చేసుకోవాలని ప్రేరేపించడం మాత్రమే’’ అని ఆయన వివరించారు.  గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తనకు ఈ దేశం ఎన్నో అవకాశాలను ఇచ్చిందన్నారు. 

రాకెట్ తయారీ, పీఎస్ఎల్‌వీ, జీఎస్ఎల్‌వీ మార్క్ 3, చంద్రయాన్-3 మిషన్ తదితర అంతరిక్ష మిషన్‌ల అనుభవాలు, ఇస్రోలో తన ప్రయాణాన్ని ఈ పుస్తకంలో సోమనాథ్ వెల్లడించారు. కాలేజీ రోజుల్లో బస్సు చార్జీలకు ఆయన వద్ద డబ్బులు ఉండేవి కావట. దీంతో, పాత సైకిల్‌పైనే కాలేజీకి వెళ్లేవారట. డబ్బులు లేక ఓ చిన్న హోటల్ గదిలో ఉండేవాడినని సోమ్‌నాథ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. కుటుంబంలో ఆర్థిక సమస్యల కారణంగా స్టడీ టూర్‌లకు వెళ్లలేకపోయేవాడినని ప్రస్తావించారు. 

సోమనాథ్ స్వస్థలం కేరళలోని అళప్పుళ జిల్లా. కొల్లంలో టీకేఎం కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన సోమనాథ్ బెంగళూరులోని ఐఐఎస్‌సీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1985లో విక్రమ్ సారా భాయి స్పేస్ సెంటర్‌లో చేరారు. అక్కడ ఉపగ్రహ వాహకనౌకల డిజైనింగ్‌లో కీలకపాత్ర పోషించారు. 2010-14 మధ్య జీఎస్ఎల్‌వీ మార్క్-3 డైరెక్టర్‌గా శాటిలైట్ల అభివృద్ధికి సంబంధించి పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. వీఎస్ఎస్‌సీ డైరెక్టర్‌గానూ చేశారు.


More Telugu News