ముందు నాపై పోటీ చేసి గెలువు: రేవంత్ రెడ్డికి కొడంగల్ ఎమ్మెల్యే సవాల్

  • కేసీఆర్‌కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని రేవంత్ రెడ్డి నిన్న సవాల్
  • కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రతి సవాల్
  • గతంలో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అంటివి కదా? అని ప్రశ్న
  • సొంత కార్యకర్తలకు ఏం చేయని రేవంత్ కొడంగల్‌కు ఏం చేస్తారని నిలదీత
  • కేటీఆర్ దత్తత తీసుకున్నాక కొడంగల్ అభివృద్ధి జరిగిందన్న పట్నం నరేందర్ రెడ్డి
కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్ నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ముందు త‌న‌పై పోటీ చేసి గెలవాల‌ని ప్రతి సవాల్ విసిరారు. టీపీసీసీ చీఫ్ త‌న‌పై గెలిచాక ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ గురించి ఆలోచన చేయాలని చురకలు అంటించారు. బుధవారం ఆయన కొడంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ... గతంలోనే కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ చెప్పారని, అలాంటప్పుడు మళ్లీ ఎలా పోటీ చేస్తావ్? అని ప్రశ్నించారు.

సొంత కార్యకర్తలకు న్యాయం చేయని రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడన్నారు. పీసీసీ పోస్ట్ రూ.300 కోట్లకు కొనుక్కున్నాడని ఆయన కార్యకర్తలే చెప్పారన్నారు. ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ అన్నారు. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న తనను కొడంగల్ నియోజకవర్గ ప్రజలు 30వేల మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్నాక కొడంగల్ అభివృద్ధి జరిగిందన్నారు. కోస్గిలో, మద్దూర్‎లో రోడ్ల వైడనింగ్, మున్సిపాలిటీల అభివృద్ధి జరిగిందన్నారు. డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. గ్రామాలలో రోడ్లు, సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. అందుకే కొడంగల్ ప్రజలు బీఆర్ఎస్‌ను మళ్లీ గెలిపిస్తారన్నారు.


More Telugu News