రాజ్యాంగం సాక్షిగా.. కేరళలో వినూత్న వివాహం

  • ఆహ్వాన పత్రికలో అంబేద్కర్, నెహ్రూల ఫొటోలు
  • అతిథులకు రాజ్యాంగంపై అవగాహన పెంచేందుకు కరపత్రాలు
  • తాళి కట్టిన తర్వాత రాజ్యాంగ ప్రతులను ఇచ్చిపుచ్చుకున్న జంట
కేరళలో జరిగిన ఓ వివాహ తంతుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. అటు సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. ఇటు సందేశాన్ని పంచేలా వినూత్నంగా జరిగిందీ పెళ్లి.. రాష్ట్రంలోని కొల్లం జిల్లా చటన్నూరుకు చెందిన అబి, దేవికలు ఈ నెల 22న రాజ్యాంగం సాక్షిగా దంపతులుగా మారారు. వీరి వివాహానికి సంబంధించిన అన్ని పనుల్లోనూ రాజ్యాంగంపై జనాలలో అవగాహన పెంచేలా జరగడం విశేషం. ఆహ్వాన పత్రిక మొదలుకొని వివాహ తంతు దాకా.. అన్నింటా రాజ్యాంగం ప్రస్తావన ఉంది. 

ఆహ్వాన పత్రికలో అంబేద్కర్, నెహ్రూల ఫొటోలు ముద్రించడంతో పాటు వివాహ వేదిక వద్ద రాజ్యాంగ పీఠికను ప్రదర్శించారు. అతిథులకు రాజ్యాంగంలోని ముఖ్యమైన సూత్రాలు, హక్కులను వివరించేలా ముద్రించిన కరపత్రాలు పంచారు. భారత దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ అయిన రాజ్యాంగ అక్షరాస్యత క్యాంపెయిన్ లో అబి, దేవికలు పనిచేశారు. ఆ కార్యక్రమంలోనే ఇద్దరూ కలుసుకున్నారు. ఆపై మనసులు కలవ డంతో పెద్దలను సంప్రదించి పెళ్లికి అనుమతి పొందారు.

పెళ్లి తంతు వినూత్నంగా ఉండడంతో పాటు తమ నమ్మకాలకు అనుగుణంగా ఉండాలని ఈ విధంగా ప్లాన్ చేసినట్లు ఈ కొత్త జంట వెల్లడించింది. పెళ్లి మండపం ప్రవేశ ద్వారం వద్ద భారత రాజ్యంగ పీఠిక, మండపం వెనక అంబేద్కర్, నెహ్రూల ఫొటోలతో అలంకరించారు. సంప్రదాయబద్ధంగా వధువు దేవిక మెడలో తాళి కట్టిన అబి.. రాజ్యంగ ప్రతిని ఆమెకు అందించారు. దేవిక కూడా మరో ప్రతిని అబికి అందజేసింది. ఆపై వచ్చిన అతిథులకు కరపత్రాలను అందించి వివాహ తంతును పూర్తిచేశారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


More Telugu News