బంగ్లాపై దక్షిణాఫ్రికా భారీ విజయంతో మారిపోయిన పాయింట్ల పట్టిక.. న్యూజిలాండ్ పరిస్థితి ఏంటంటే..!

  • రెండవ స్థానానికి ఎగబాకిన దక్షిణాఫ్రికా
  • తక్కువ రన్‌రేట్ కారణంగా మూడో స్థానానికి కివీస్
  • బంగ్లాపై దక్షిణాఫ్రికా భారీ విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో దక్షిణాఫ్రికా దూకుడు కొనసాగుతోంది. ప్రత్యర్థులపై భారీ స్కోర్లతో విరుచుకుపడుతూ ఘనవిజయాలు నమోదు చేస్తోంది. తాజాగా మంగళవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా బంగ్లాపై మ్యాచ్‌లో కూడా 149 పరుగుల తేడాతో గెలుపు సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరడంతోపాటు రన్‌రేట్ కూడా మరింత మెరుగయ్యింది. దీంతో వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

5 మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలుపులతో దక్షిణాఫ్రికా రెండవ స్థానానికి ఎగబాకింది. ఇక న్యూజిలాండ్ కూడా 5 మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించినప్పటికీ రన్‌రేటు తక్కువగా ఉండడంతో మూడవ స్థానానికి పడిపోయింది. ఐదు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ గెలుపొందిన భారత్ మొత్తం 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, 5,6 స్థానాల్లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి.

కాగా మంగళవారం వాంఖడే స్టేడియంలో బంగ్లాపై మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్ చెలరేగి ఆడారు. బంగ్లా బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. డికాక్ 174, క్లాసెన్ 90 పరుగులతో రాణించడంతో 50 ఓవర్లలో 382 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 233 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా 111 పరుగులతో రాణించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.


More Telugu News