ఏపీ అప్పులు భవిష్యత్తులో కూడా తీర్చలేని స్థాయికి చేరుకున్నాయి.. ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించండి: కేంద్రానికి పురందేశ్వరి లేఖ

  • వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందన్న పురందేశ్వరి
  • సొంత మీడియా, వాలంటీర్ల ద్వారా బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య
  • అన్ని రకాల గ్యారెంటీలను, బకాయిలను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురావాలని విన్నపం
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్ర కార్పొరేషన్ల పైన, బేవరేజ్ కార్పొరేషన్ వంటి వాటిపైనా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తీవ్ర ఆర్థిక మోసాల విచారణ సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాలని ఆమె కోరారు. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈమేరకు ఆమె ఓ వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని ఆమె కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.77 లక్షల కోట్లు అప్పు చేసిన విషయాన్ని ఇప్పటికే తమ దృష్టికి తీసుకొచ్చానని... ఇప్పటికీ ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు అలాగే ఉందని చెప్పారు.  

ఆర్బీఐకు దాఖలు చేసిన రూ. 4.42 లక్షల కోట్ల గురించి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని... కార్పొరేషన్లతో సహా చేసిన ఇతర అప్పుల గురించి చెప్పలేదని పురందేశ్వరి తెలిపారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని అడ్డు పెట్టుకుని... వారి సొంత కుటుంబ మీడియా ద్వారా, వాలంటీర్ల ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు భవిష్యత్తులో కూడా తీర్చలేని స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. అన్ని రకాల గ్యారెంటీలను, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురావాలని కోరారు.


More Telugu News