హమాస్ ను ఏరిపారేసేదాకా దాడులు ఆగవు: ఇజ్రాయెల్
- ప్రకటించిన ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్
- హమాస్ ను కూల్చివేయనున్నట్టు వెల్లడి
- హమాస్ ఎక్కడున్నా ఏరిపారేస్తామని ప్రకటన
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం 17వ రోజుకు చేరుకుంది. హమాస్ ను నిర్వీర్యం చేసేందుకు నిరంతరాయ దాడులకు తాము సన్నద్ధం అయినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (సాయుధ దళాల చీఫ్) లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ఓ ప్రకటన విడుదల చేశారు. దాడులు ఆపే ఉద్దేశ్యం ఏదీ లేదని స్పష్టం చేశారు. హమాస్ ను పూర్తిగా కూల్చివేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అదే పనిగా దాడులకు దిగడమే హమాస్ మార్గం. హమాస్ ఎక్కడున్నా సరే దెబ్బతీయడమే లక్ష్యమని ప్రకటించారు.
యుద్ధం హైలైట్స్
- తమ చెరలో ఉన్న ఇద్దరు ఇజ్రాయెలీలను హమాస్ మిలిటెంట్లు మానవతా కోణంలో తాజాగా విడుదల చేశారు. వారి చెరలో మొత్తం 200 మంది ఇజ్రాయెల్ వాసులు ఉణ్నారు.
- 17 రోజుల యుద్ధంలో మృతుల సంఖ్య 6,400 దాటింది.
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నెలవారీ సమావేశం నేడు జరగనుంది. ఇజ్రాయెల్-పాలస్థీనా పరిస్థితులపై దీనిలో దృష్టి సారించనున్నారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని, పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ అమెరికా తీర్మానం ప్రవేశపెట్టనుంది.
- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ మంగళవారం ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు.
- అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చిన్న ప్రకటన విడుదల చేశారు. హమాస్ పై ప్రతీకార చర్యల్లో భాగంగా ఎక్కువ మంది పౌరులకు నష్టం తలెత్తకుండా చూడాలని కోరారు.