అందరి ఆశీస్సులతో మళ్లీ పార్టీలోకి వచ్చా: రాజాసింగ్

  • గతంలో రాజాసింగ్ ను సస్పెండ్ చేసిన బీజేపీ
  • నిన్న సస్పెన్షన్ ఎత్తివేత
  • గోషా మహల్ టికెట్ రాజా సింగ్ కే కేటాయింపు
  • కరీంనగర్ వెళ్లి బండి సంజయ్ ని కలిసిన రాజా సింగ్
వివాదాస్పద వ్యాఖ్యలు, పోలీసు కేసుల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేయడం తెలిసిందే. నిన్న ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ బీజేపీ ప్రకటన చేసింది. అంతేకాదు, గోషా మహల్ టికెట్ ను కూడా రాజా సింగ్ కే కేటాయించింది. 

పార్టీ తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు, మళ్లీ టికెట్ ఇవ్వడంతో రాజాసింగ్ లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఇవాళ ఆయన కరీంనగర్ వెళ్లి బీజేపీ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మీడియాతో మాట్లాడారు. 

అందరి ఆశీస్సులతో మళ్లీ పార్టీలోకి వచ్చానని వెల్లడించారు. 14 నెలలు పార్టీకి దూరంగా ఉన్నానని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి ఒక చాన్స్ ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అంటూ సీఎం కేసీఆర్ మోసం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని రాజా సింగ్ విమర్శించారు.


More Telugu News