ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: ఇరాన్‌‍కు అమెరికా తీవ్ర హెచ్చరిక

  • ఇరాన్‌కు అమెరికా సెనేటర్ హెచ్చరిక
  • మద్దతు సంస్థలతో యుద్ధాన్ని ఎగదోస్తే ఇరాన్ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వ్యాఖ్య
  • ఇరాన్ ప్రమేయం లేకుండా హమాస్ దాడులు జరిగాయని భావిస్తే హాస్యాస్పదమవుతుందన్న సెనేటర్
తన మద్దతు సంస్థలతో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ఎగదోస్తే ఇరాన్ అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. ఇరాన్‌కు ఓ హెచ్చరిక జారీ చేస్తున్నామని, వారిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం తీవ్రతరమైతే అది మీ వరకూ వస్తుందన్నారు. ఇరాన్ ప్రమేయం లేకుండా హమాస్ దాడులు జరిగాయని భావిస్తే అది హాస్యాస్పదమవుతుందని వ్యాఖ్యానించారు.

కాగా, ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7నాటి హమాస్ దాడుల్లో ఇరాన్ ప్రమేయం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. సెనేటర్ లిండ్సే గ్రాహం కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు.

గాజాలోని హమాస్‌తో పాటు లెబనాన్‌‍లోని హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతుదారు. ఈ తీవ్రవాద సంస్థలకు నిధులు, ఆయుధాలను ఇరాన్ సరఫరా చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం అమల్లోకి వస్తే ముస్లిం దేశాల్లో పలుకుబడి ఉన్న ఇరాన్‌కు దెబ్బే. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌పై వ్యూహాత్మకంగా హమాస్‌తో ఇరాన్ దాడులు చేయించి ఉంటుందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.


More Telugu News