ఉత్తరాంధ్ర వాళ్లను పుంగనూరులో బట్టలు విప్పించి అవమానించారు: రామ్మోహన్ నాయుడు
- సైకిల్ యాత్ర చేస్తున్న వారిని అవమానించారన్న రామ్మోహన్ నాయుడు
- మంత్రి పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్
- జగన్ విశాఖకు రావాలనుకుంటున్నది ఉత్తరాధ్రవారిని అవమానించడానికా అని ప్రశ్న
ఉత్తరాంధ్ర ప్రజలపై ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేకంగా ఎలాంటి ప్రేమ లేదని... ఆయన చూపేదంతా దొంగ ప్రేమేనని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు నలుగురు శ్రీకాకుళం జిల్లా వ్యక్తులను అవమానించారని... ఇది ఉత్తరాంధ్రను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. సైకిల్ యాత్ర చేస్తున్న బీసీ కార్యకర్తలను అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జిల్లా వాసులను బట్టలు విప్పించి అవమానించారని దుయ్యబట్టారు. ఈ దారుణానికి బాధ్యత వహిస్తూ మంత్రి పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మిథున్ రెడ్డి తనను అవమానించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెపుతున్న వైసీపీ నేతలు... ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతిని అన్ని ఆధారాలతో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. దేశం మొత్తం చంద్రాబాబుకు సంఘీభావం ప్రకటిస్తోందని తెలిపారు. కేసులకు భయపడకుండా టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్ట్ పై పోరాటం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి విశాఖకు రావాలనుకుంటున్నది ఉత్తరాధ్రకు చెందిన వారిని అవమానించడానికా? అని ఆయన ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగ్యం వద్దనే వైఎస్ విజయలక్ష్మిని విశాఖ ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశారు.