భారత్‌లో 'ఫాగ్' నడుస్తోంది, ఇంగ్లండ్‌లో 'బర్నాల్' నడుస్తోంది!: సెహ్వాగ్ సెటైర్

  • ధర్మశాల స్టేడియం అవుట్ ఫీల్డ్ ప్రమాదకరమన్న ఇంగ్లండ్‌
  • అదే స్టేడియంలో వ్యూహాత్మకంగా ఫీల్డింగ్ చేసిన భారత్
  • ఇంగ్లండ్ కు చురకలు అంటించిన సెహ్వాగ్
ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అవుట్ ఫీల్డ్ మరోసారి చర్చనీయాంశమైంది. అవుట్‌ఫీల్డ్‌ ప్రమాదకరంగా ఉందని, ఆటగాళ్లు గాయాల బారిన పడేందుకు అవకాశం ఉందంటూ విమర్శలు వచ్చాయి. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌కు ముందు ఇక్కడ మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు కూడా అవుట్‌ఫీల్డ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందిస్తూ.. ధర్మశాల స్టేడియం అవుట్ ఫీల్డ్ అంతర్జాతీయ మ్యాచ్‌లకు అనర్హమైనది అని ఘాటైన వ్యాఖ్య చేశాడు. ఈ విమర్శలపై టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో చురకలు అంటించాడు.

‘‘భారత్‌ లో 'ఫాగ్' నడుస్తోంది. ఇంగ్లండ్‌లో 'బర్నాల్' నడుస్తోంది. వీటన్నింటికంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల హవా ఎక్కువగా  కొనసాగుతోంది’’ అంటూ ఎక్స్‌ వేదికగా సెహ్వాగ్ స్పందించాడు. ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు అనంతరం మాజీ దిగ్గజం ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇక్కడ డైవింగ్‌ చేస్తే ఆటగాళ్లు గాయాల పాలయ్యే ప్రమాదముందని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బట్లర్‌, ఆఫ్ఘన్‌ కోచ్‌ ట్రాట్‌ అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

ప్రమాదకరం అని ఇంగ్లండ్ భావించిన ధర్మశాల స్టేడియం అవుట్  ఫీల్డ్ లో భారత్ ఎంతో జాగ్రత్తగా ఫీల్డింగ్ చేసిందన్న విషయాన్ని సెహ్వాగ్ పరోక్షంగా ప్రస్తావించాడు. అదే సమయంలో, ఈ స్టేడియంపై ఇంగ్లండ్ బాహాటంగా విమర్శలు గుప్పించడాన్ని, టీమిండియా ఎలాంటి విమర్శలకు పోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లడాన్ని కూడా సెహ్వాగ్ తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పాడు. ముఖ్యంగా, ధర్మశాలలో టీమిండియా సాధికారికంగా గెలవడం పట్ల ఇంగ్లండ్ కడుపు మంటతో రగిలిపోతుంటుందని వ్యంగ్యంగా చెప్పేందుకు బర్నాల్ (కాలిన గాయాలకు పూసే మందు) పేరును ఉపయోగించి ట్వీట్ చేశాడు.


More Telugu News