వీధికుక్కల దాడిలో గాయపడి... వాఘ్ బక్రీ టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ మృతి

  • అక్టోబర్ 15న వీధికుక్కలు దాడి చేయడంతో కిందపడిన పరాగ్ దేశాయ్
  • అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూత
ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ మృతి చెందారు. ఆయన వయస్సు 49. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. మెదడులో రక్తస్రావం కారణంగా ఆదివారం మృతి చెందినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గతవారం ఆయన ఇంటికి సమీపంలో కిందపడటంతో తలకు గాయమైంది. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మెదడులో రక్తస్రావం కారణంగా తుదిశ్వాస విడిచినట్లు కంపెనీ తెలిపింది.

గతవారం... అక్టోబర్ 15న వీధి కుక్కలు దాడి చేయడం వల్ల పరాగ్ దేశాయ్ కిందపడినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. వీధి కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌లోని జైదాన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. పరాగ్ దేశాయ్ మృతి పట్ల వాఘ్ బక్రీ టీ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో పరాగ్ దేశాయ్ ఒకరు. కంపెనీని ఈ-కామర్స్‌లోకి తీసుకు వెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. కంపెనీ సేల్స్, మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్ విభాగాల కార్యకలాపాలను పరాగ్ పర్యవేక్షించేవారు. అమెరికాలో ఎంబీయే పూర్తి చేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది.


More Telugu News