విజయవాడలో వంగవీటి రాధా పెళ్లి... హాజరైన పవన్ కల్యాణ్
- పోరంకి మురళీ రిసార్ట్స్ లో వంగవీటి రాధా, పుష్పవల్లి వివాహం
- నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- ఆగస్టులో రాధా, పుష్పవల్లి నిశ్చితార్థం
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఓ ఇంటి వారయ్యారు. వంగవీటి రాధా, పుష్పవల్లి వివాహం విజయవాడలో జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ వివాహానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. నూతన వధూవరులు వంగవీటి రాధా, పుష్పవల్లికి శుభాకాంక్షలు తెలియజేశారు. వంగవీటి రాధాకు పార్టీలకు అతీతంగా మిత్రులు ఉండడంతో ఆయన పెళ్లిలో పలు పార్టీల నేతలు దర్శనమిచ్చారు. రాధా పెళ్లి వేడుకకు విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ వేదికగా నిలిచింది. రాధా, పుష్పవల్లి నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది. పుష్పవల్లి స్వస్థలం నర్సాపురం. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల కుమార్తె పుష్పవల్లి.