హైటెక్ సిటీకి పాతికేళ్లు... చంద్రబాబు చిత్రంతో ఉన్న లోగో ఆవిష్కరణ

  • హైదరాబాద్ కు తలమానికంగా హైటెక్ సిటీ
  • 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాదులో సిల్వర్ జూబ్లీ వేడుకలు
  • లోగోను ఆవిష్కరించిన ఏపీ జైళ్ల శాఖ మాజీ డీజీ గోపీనాథరెడ్డి
  • హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబే పునాది వేశారని వెల్లడి
హైదరాబాద్ కే తలమానికంగా నిలిచే హైటెక్ సిటీకి పాతికేళ్లు నిండాయి. హైదరాబాద్ కు ఐటీ నగరంగా గుర్తింపు వచ్చిందంటే ఈ హైటెక్ సిటీనే కారణం. హైటెక్ సిటీ నిర్మాణం పూర్తి చేసుకుని 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిపారు. 

ఈ సందర్భంగా హైటెక్ సిటీ రూపకర్త చంద్రబాబునాయుడు ముఖచిత్రంతో ఉన్న లోగోను ఆవిష్కరించారు. హైటెక్ సిటీ కోసం చంద్రబాబు చేసిన కృషిని ఐటీ ఉద్యోగులు, నిపుణులు వేనోళ్ల కీర్తించారు. 

కాగా, చంద్రబాబు లోగోను ఆవిష్కరించిన అనంతరం ఏపీ జైళ్ల శాఖ మాజీ డీజీ గోపీనాథరెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందన్నా, ఒక అభివృద్ధి చెందిన నగరంగా రూపుదిద్దుకుందన్నా అందుకు చంద్రబాబే కారణమని కొనియాడారు. ప్రపంచంలోనే ఒక విశిష్ట నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలని చంద్రబాబు తపించారని వెల్లడించారు. 

పాతికేళ్ల కిందట చంద్రబాబుతో పాటు బిల్ గేట్స్ ను కలిసినవారిలో తాను కూడా ఉన్నానని గోపీనాథరెడ్డి గుర్తుచేసుకున్నారు. మొదట్లోనే మైక్రోసాఫ్ట్ వంటి అగ్రగామి సంస్థ హైదరాబాద్ రావడంతో, మిగతా ప్రముఖ సంస్థలు కూడా హైదరాబాద్ వచ్చాయని ఆయన వివరించారు. రాముడు అంతటి మహనీయుడికే కష్టాలు వచ్చాయని, ఇవాళ అన్ని రంగాలకు చెందిన వారు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తుండడం హర్షణీయం అని పేర్కొన్నారు.


More Telugu News