ఈడీ కేసుపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

  • జీఐపీఎల్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న విక్రమ్ రెడ్డి
  • కేరళలో రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు కోసం ఏర్పాటైన సంస్థ
  • రోడ్డు పూర్తి కాకుండానే టోల్, ప్రకటన చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు
  • సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయడం తెలిసిందే. మేకపాటి కుటుంబానికి కేఎంసీ అనే సంస్థ ఉంది. ఈ సంస్థకు అనుబంధంగా గురువాయూర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐపీఎల్) అనే సంస్థ ఏర్పాటైంది. కేరళలో రహదారుల నిర్మాణం కోసం కేఎంసీ తరఫున జీఐపీఎల్ స్థాపించారు. 

అయితే రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా, బస్ షెల్టర్లు నిర్మించకుండా... టోల్ చార్జీలు, ప్రకటన చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఈ కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈడీ పలు చోట్ల సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. జీఐపీఎల్ డైరెక్టర్ గా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. దీనిపై మేకపాటి విక్రమ్ రెడ్డి స్పందించారు. 

50 ఏళ్లుగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యాపార రంగంలో ఉన్నామని తెలిపారు. పబ్లిక్, ప్రైవేటు ప్రాజెక్టు పనుల్లో ఇలాంటి విచారణలు సాధారణమేనని వ్యాఖ్యానించారు. తమ కంపెనీపైనే కాదని, తమతో కలిసి పనిచేస్తున్న మరో కంపెనీపైనా విచారణ జరిగిందని విక్రమ్ రెడ్డి వెల్లడించారు. ఈడీ కోరిన డాక్యుమెంట్లు ఇచ్చామని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. 

2019లో వైసీపీ గెలిచాక మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి అయ్యారు. అయితే ఆయన హఠాన్మరణం చెందడంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. గౌతమ్ రెడ్డి వారసుడిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని కుటుంబం బరిలో దింపింది. సీఎం జగన్ ఆశీస్సులు కూడా ఉండడంతో మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు.


More Telugu News