5 వికెట్లతో షమీ ఫైర్... న్యూజిలాండ్ 273 ఆలౌట్

  • ధర్మశాలలో నిప్పులు చెరిగిన షమీ
  • న్యూజిలాండ్ ను కట్టడి చేయడంలో కీలకపాత్ర
  • డారిల్ మిచెల్ సెంచరీ... అయినా కివీస్ కు దక్కని ప్రయోజనం
  • 300 కూడా దాటని స్కోరు
  • చివర్లో అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు, ఫీల్డర్లు
వరల్డ్ కప్ లో గత నాలుగు మ్యాచ్ ల్లో పక్కనబెట్టిన పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఇవాళ హీరో అయ్యాడు. న్యూజిలాండ్ పై ఎంతో కసితో బౌలింగ్ చేసిన షమీ 5 వికెట్లతో సత్తా చాటడం విశేషం. 

టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.... మొదట బ్యాటింగ్  చేసిన కివీస్ సరిగ్గా 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఓ దశలో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధిస్తుందనిపించినా... టీమిండియా పుంజుకున్న తీరు అద్భుతం. చివరి 10 ఓవర్లలో బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్  చేయగా, ఫీల్డింగ్ వేరే లెవల్ కు చేరింది. ముఖ్యంగా షమీ సమయోచిత బౌలింగ్ తో కివీస్ జోరుకు కళ్లెం పడింది.  

డారిల్ మిచెల్ (130) సెంచరీ సాధించినప్పటికీ, కివీస్ కు పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఎందుకంటే ఆ జట్టు 300 పరుగుల మార్కు దాటలేకపోయింది. ఓ దశలో డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర జోడీ బ్యాటింగ్ చూస్తే... కివీస్ స్కోరు ఎక్కడికో వెళుతుందనిపించింది. అయితే రచిన్ రవీంద్రను అవుట్ చేయడం ద్వారా ఈ జోడీని విడదీసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చింది కూడా షమీనే. చివర్లో యార్కర్లతో కివీస్ బ్యాట్స్ మెన్లను కట్టిపడేసింది కూడా షమీనే. 

48వ ఓవర్లో రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన షమీ... చివరి ఓవర్లో సెంచరీ హీరో డారిల్ మిచెల్ ను సైతం పెవిలియన్ చేర్చడం విశేషం. మొత్తమ్మీద వరల్డ్ కప్ లలో తన వికెట్ల సంఖ్యను షమీ 36కి పెంచుకున్నాడు. అంతేకాదు, వరల్డ్ కప్ లలో ఐదేసి వికెట్లను రెండుసార్లు పడగొట్టి, ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ గా ఘనత అందుకున్నాడు.


More Telugu News