ఈ నెల 26 నుంచి వైసీపీ బస్సుయాత్ర చేపడతామన్న బొత్స

  • మా ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించేందుకే ఈ యాత్ర
  • నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నికల హామీలన్నీ అమలు చేశామన్న మంత్రి
  • మొదటి దశ సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్ వెల్లడించిన బొత్స
నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును, ప్రభుత్వం చేసిన పనులను వివరించేందుకే సామాజిక బస్సు యాత్ర చేపడుతున్నట్లు ఏపీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సామాజిక బస్సు యాత్ర తొలి దశ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ నెల 26 న ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర మొదలవుతుందని వివరించారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ పేరుతో జనంలోకి వెళతామని చెప్పారు.

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ జగన్ సర్కారు నెరవేర్చిందని మంత్రి బొత్స తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కన్న కలలను గ్రామ సచివాలయం ద్వారా నెరవేర్చామని, దేశంలో ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని మంత్రి బొత్స చెప్పారు. ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం సహా వివిధ రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని వివరించారు. రైతు భరోసా కేంద్రాలతో రైతాంగానికి జగన్ సర్కారు అండగా నిలబడుతోందని మంత్రి వివరించారు.



More Telugu News