ప్రియుడి మోజులో పదిన్నర కేజీల బంగారం చోరీ చేసిన కంకిపాడు మణప్పురం బ్రాంచి మేనేజర్ పావని.. వలపన్ని అరెస్ట్ చేసిన పోలీసులు

  • ఈ నెల 16న ఘటన
  • మనస్పర్థల కారణంగా భర్తతో దూరంగా ఉంటున్న పావని
  • ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడితో ప్రేమాయణం
  • అతడి అప్పులు తీర్చడంతోపాటు విలాసవంతమైన జీవితం గడపాలని చోరీ
  • శిరిడీలో అరెస్ట్ చేసి కంకిపాడు తీసుకొచ్చిన పోలీసులు
దాదాపు పదిన్నర కేజీల బంగారంతో ఉడాయించిన కంకిపాడు మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ రెడ్డి వెంకటపావని ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. అప్పుల్లో ఉన్న ప్రియుడిని బయటపడేసేందుకే ఆమె ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ రూరల్ లింగవరం అడ్డరోడ్డుకు చెందిన పావని గత ఫిబ్రవరిలో కంకిపాడు బ్రాంచికి బదిలీపై వచ్చింది. భర్తతో మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్న ఆమెకు కృత్తివెన్నుకు చెందిన ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడితో పరిచయం ఏర్పడింది. అది మరింత ముదిరింది. అతడికి అప్పటికే అప్పులు ఉండడం.. విలాసవంతమైన జీవితం గడపాలన్న కోరిక వెరసి బ్యాంకు చోరీకి పథక రచన చేశారు.

ఈ నెల 16న రాత్రి బ్యాంకుకు వెళ్లి 10.660 కేజీల బంగారు ఆభరణాలు చోరీ చేసి ఇంటికి వెళ్లింది. అక్కడ బ్యాగు, సెల్‌ఫోన్ పెట్టేసి చోరీచేసిన బంగారంలో కొంత తీసుకుని మిగతాది ప్రియుడికి అప్పగించింది. అదే సమయంలో తన బంధువులు శిరిడీ వెళ్తుంటే వారితో కలిసి వెళ్లింది. 

మరోవైపు, అప్పటికే చోరీ విషయం వెలుగు చూసి కేసు నమోదు కావడంతో పోలీసులు పావనిపై నిఘాపెట్టారు. బంధువుల ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో పావని మాట్లాడుతుండడాన్ని పసిగట్టారు. ఆ వెంటనే బృందాలుగా ఏర్పడి శిరిడీ వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి కంకిపాడుకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.


More Telugu News