న్యూజిలాండ్‌పై మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు టీమిండియాకి బిగ్ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం?

  • ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్
  • మణికట్టుకు బలంగా తాకిన బంతి
  • పాండ్యా స్థానంలో ఆడించే అవకాశమున్న సమయంలో గాయం
వరల్డ్ కప్ 2023లో నేడు (ఆదివారం) అత్యంత రసవత్తరమైన పోరుకు తెరలేవబోతోంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఆతిథ్య భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌ కోసం ఇటు భారత్, ఫ్యాన్స్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే  ఈ మ్యాచ్‌తో పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగాలని భావించిన భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. 


ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయం కారణంగా న్యూజిలాండ్ మ్యాచ్‌కు దూరం కానుండడం ఇప్పటికే ఖరారైంది. తాజాగా మరో స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. నెట్స్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతడు గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో త్రోడౌన్ స్పెషలిస్ట్‌ విసిరిన బంతి సూర్య మణికట్టుకు తగిలింది. బలంగా తగలడంతో తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. దీంతో సెషన్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

హార్ధిక్ పాండ్యా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఫినిషర్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు చోటు లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో అతడు గాయంపాలవ్వడం జట్టును కలవరపరిచే అంశంగా పరిగణించాలి. గాయం తీవ్రత ఎంత, మ్యాచ్‌లో చోటు దక్కుతుందా లేదా అని వేచిచూడాల్సి ఉంది. మరోవైపు ప్రాక్టీస్ చేస్తుండగా ఇషాన్ కిషన్‌ను తేనెటీగ మెడపై కుట్టింది. దీంతో అతడు కూడా ప్రాక్టీస్‌కి దూరమయ్యాడు. అయితే ఇషాన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని రిపోర్టులు చెబుతున్నాయి.

కాగా.. ప్రస్తుత వరల్డ్ కప్‌లో రెండు జట్లూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. చెరో నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఎనిమిది పాయింట్లతో ఉన్నాయి. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. ఇక  2003 నుంచీ ఏ ఐసీసీ టోర్నీలోనూ కివీస్‌ను భారత్ ఓడించలేదు.


More Telugu News