హెచ్1-బీ విధానంలో కీలక మార్పు చేయనున్న అమెరికా

  • అమెరికాలో ఉద్యోగాలు పొందాలనుకునే వారి కోసం హెచ్1-బీ వీసాలు
  • లాటరీ విధానంలో వీసాలు కేటాయిస్తున్న అమెరికా
  • ఒకరు అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
  • ఈ వెసులుబాటును క్రమబద్ధీకరించేలా మార్పులు చేసేందుకు అమెరికా కసరత్తు
అమెరికాలోని సంస్థలు విదేశీ నిపుణులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు హెచ్1-బీ వీసా విధానం ఉపయోగపడుతుందని తెలిసిందే. హెచ్1-బీ వీసాల ద్వారా అత్యధికంగా లాభపడేవారిలో భారతీయులు ముందు వరుసలో ఉంటారు. అయితే, ఈ హెచ్1-బీ వీసా విధానంలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) అక్టోబరు 23న విడుదల చేయనుంది. 

విదేశీ ప్రతిభావంతులను మరింత ఎక్కువ స్థాయిలో అమెరికా దిశగా ఆకర్షించడం, అదే సమయంలో అమెరికా సంస్థలపై అనవసర భారాన్ని తగ్గించడం తదితర అంశాలను బైడెన్-హారిస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. అదే సమయంలో హెచ్1-బీ విధానంలో అవినీతిని తగ్గించడం, వివాదరహితంగా వీసాల జారీ చేపట్టడమే తమ లక్ష్యమని అమెరికా హోంశాఖ వెల్లడించింది. 

కాగా, అమెరికా కాంగ్రెస్ నిర్దేశించిన ఏడాదికి 60 వేల హెచ్1-బీ వీసాల జారీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఇప్పటివరకు హెచ్1-బీ వీసాల కోసం ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే వీలుండేది. తద్వారా లాటరీ విధానంలో ఆ వ్యక్తి అవకాశాలు మెరుగ్గా ఉండేవి. 

తాజా ప్రతిపాదిత విధానంలో, ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు సమర్పించినా, ఎంపిక ప్రక్రియలో మాత్రం ఆ వ్యక్తి పేరు ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకుంటారు. దాంతో వీసాల జారీ ప్రక్రియ మరింత నైతికతను సంతరించుకుంటుందని, పారదర్శకంగానూ ఉంటుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఒక వ్యక్తి అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకుని లబ్ది పొందడాన్ని నూతన విధానం కట్టడి చేస్తుంది. 

దీనివల్ల అత్యున్నత స్థాయిలో నైపుణ్యం ఉన్న వారే అమెరికాలోని సంస్థల్లో ఉద్యోగాలు పొందే అవకాశాలు మెరుగవుతాయని వీసా సంస్కరణల ఉద్యమకారుడు అజయ్ భుటోరియా తెలిపారు.


More Telugu News