బీఆర్ఎస్ పార్టీలో చేరిన డాక్టర్ చెరుకు సుధాకర్

  • హరీశ్, కేటీఆర్ సమక్షంలో కారు ఎక్కిన సుధాకర్
  • చెరుకు సుధాకర్ కరుడుగట్టిన ఉద్యమకారుడన్న హరీశ్ రావు
  • కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై విమర్శలు
తెలంగాణ సీనియర్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రులు హరీశ్ రావు, కేటీ రామారావు సమక్షంలో ఆయన కారు ఎక్కారు. ఆయనకు కండువా కప్పి మంత్రులు పార్టీలోకి ఆహ్వానించారు. బీసీ నేతల విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు. 

హరీశ్ రావు మాట్లాడుతూ... చెరుకు సుధాకర్ కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమకారుడు అన్నారు. ఉద్యమం సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడని విమర్శించారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఘనత ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిది అన్నారు. రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ అంటేనే మాటలు.. ముఠాలు.. మంటలు అని ఎద్దేవా చేశారు. తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరన్నారు. ప్రజలను అబద్ధాలతో మోసం చేయాలని చూస్తున్నారన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆచరిస్తుంటే దేశం అనుసరిస్తోందన్నారు.


More Telugu News